తవ్వకాల కలకలం | - | Sakshi
Sakshi News home page

తవ్వకాల కలకలం

May 5 2025 8:22 AM | Updated on May 5 2025 11:41 AM

తవ్వక

తవ్వకాల కలకలం

లుకలాంలో..
● తాగునీటి ప్రాజెక్టు సమీపంలోనే ఇసుక తవ్వకాలు ● ఆందోళన చెందుతున్న స్థానికులు

నరసన్నపేట : ఉచితం విధానం పేరిట వంశధార నదిలో ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. నదిలో తమకే హక్కులు ఉన్నాయన్న చందంగా నది మొత్తం జేసీబీలతో గుల్ల చేసేస్తున్నారు. మంజూరు చేసిన విస్తీర్ణానికి మించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. చెంతనే తాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయని కూడా చూడకుండా ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దీంతో లుకలాం గ్రామస్తులతో పాటు నరసన్నపేట మండలవాసులు ఆందోళన చెందుతున్నారు. లుకలాంలో అధికారికంగా ఇసుక ర్యాంపు ఇవ్వకపోయినా ఎదురుగా శ్రీకాకుళం రూరల్‌ మండలం బట్టేరు ర్యాంపునకు అధికారులు అనుమతులిచ్చారు. వారికిచ్చిన పరిధిని దాటి నదిలో నరసన్నపేట మండలం లుకలాం వైపు వచ్చి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నదీ గర్భాన్ని ఛిద్రం చేసేస్తున్నారు. ఎక్కడికక్కడ గోతులు పెట్టి జేసీబీలతో ఇసుకను తవ్వి లారీలతో తరలిస్తున్నారు. మిగిలిన ప్రాంతం మాట ఎలా ఉన్నా లుకలాం వద్ద ఉన్న రక్షిత మంచినీటి ప్రాజెక్టుకు సమీపాన భారీ ఎత్తున తవ్వకాలు చేస్తున్నారు.

తాగునీటి సరఫరాకు ముప్పు..

ఇక్కడి తాగునీటి ప్రాజెక్టు నుంచి 18 గ్రామాలకు నీరు సరఫరా అవుతుంటుంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును రూ.7 కోట్లతో నిర్మించారు. అప్పట్లో 30 గ్రామాలకుపైగా తాగునీరు సరఫరా అయ్యేది.. ప్రస్తుతం 18 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అప్పట్లో నీటి ఫిల్టర్లు నదిలో నిర్మించారు. ఇప్పుడు వీటికి దగ్గర్లోనే ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో నీటి కొరత ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నీటి ప్రాజెక్టుకు ఇబ్బంది..

వంశధార నదిలో శ్రీకాకుళం రూరల్‌ మండలం బట్టేరు ఇసుక ర్యాంపు నిర్వాహకులు తమ పరిధిని దాటి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నరసన్నపేట మండలం లుకలాం వైపు వచ్చి ఇసుక తవ్వేస్తున్నారు. రూ.7 కోట్లతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్టు సమీపంలోనే తవ్వకాలు జరుపుతుండటంతో గోతులు ఏర్పడుతున్నాయి. దీంతో నీటి ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది.

– ఎస్‌.తవిటినాయుడు, సర్పంచ్‌, లుకలాం

తవ్వకాలు ఆపాలి..

తాగునీటి ప్రాజెక్టు సమీపంలో ఇసుక తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలి. ఇదే విధంగా తవ్వకాలు జరిగితే లుకలాంతో పాటు మరో 18 గ్రామాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదముంది. ముందుగానే అదికారులు మేల్గొని తగు చర్యలు తీసుకోవాలి.

– చింతల సత్యం,

మాజీ సర్పంచ్‌, లుకలాం

తవ్వకాల కలకలం 1
1/1

తవ్వకాల కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement