
అఖిల భారత సమ్మె విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న చేపట్టనున్న అఖిలభారత సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కార్మిక, ప్రజా సంఘాల జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాలు కోసం నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి వేసిందన్నారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి, మరింత శ్రమదోపిడీ చేసేందుకు, పనిభారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేసేందుకు, పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్‌లు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ సలహాదారు చిక్కాల గోవిందరావు, వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎస్.వెంకటరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మణికొండ ఆదినారాయణమూర్తి, బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.శ్రీనివాస్, బీఎస్‌ఎన్‌ఎల్ నాయకుడు ఎం.గోవర్ధనరావు, రైతు సంఘం నాయకుడు కొత్తకోట అప్పారావు, పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పార్వతీశం, రిమ్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాకోటి చిన్నారావు, ఏపీ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు టి.ప్రవీణ, పద్మ, కళాసీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బోర చిన్నారావు, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.