
అడ్డగోలు పదోన్నతులు!
బీసీ సంక్షేమంలో..
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా బీసీ సంక్షేమ శాఖలో అవినీతి చుక్కలనంటుతోంది. రెండు రోజుల కిందట వసతి గృహ సంక్షేమాధికారులకు పదోన్నతులు కల్పించారు. ఇద్దరు హెచ్‌డబ్ల్యూఓలకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1కు ప్రమోషన్ ఇచ్చారు. కానీ సీనియారిటీ పాటించకుండా ఈ పదోన్నతులు కల్పించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు గ్రేడ్–1 పదోన్నతులు ఇచ్చారని కొందరు మండిపడుతున్నారు.
వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఈ పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని, వారిపై ఉన్న క్రమశిక్షణ అంశాలను దృష్టిలో పెట్టుకుని పదోన్నతులు కల్పించాలి. కానీ ఈ నిబంధనలేవీ పాటించలేదని తెలుస్తోంది. పదోన్నతులు కల్పించే ముందు సీనియారిటీ జాబితా విడుదల చేయాలి. ఆపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి. ఈ సారి కూడా సీనియారిటీ జాబితాపై నాలుగు అభ్యంతరాలు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోకుండా 2008 నాటి సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని పదోన్నతులు కల్పించారు. ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమని సిబ్బంది అంటున్నారు. అయితే ఎవరూ పదోన్నతులపై నోరు మెదపడం లేదు. డీబీసీ ఆదేశాల మేరకు అడ్డగోలుగా ఫైలును పెట్టి పదోన్నతులు కల్పించారని ఆరోపించారు.
అవుట్ సోర్సింగ్ సంగతేంటి..?
ఈ బీసీ సంక్షేమంలో ఆరు కారుణ్య నియామకాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ ఫైల్‌కి సంబంధించిన అన్ని ప్రక్రియలు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పూర్తయ్యాయి. అయితే కావాలనే జాప్యం చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో ఈ నియామకాలు చేయలేదు. ఎన్నికల కోడ్ పూర్తయి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ నియామకాలు జరగలేదు. దీంతో వారు రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి సిఫార్సులు చేయించుకుని వచ్చినా జిల్లా అధికారి కనికరించడం లేదు. కారుణ్యంలో కూడా కాసులు దండుకునే స్థాయికి దిగజారిపోయారని సిబ్బంది అంటున్నారు.
పదోన్నతుల్లో చేతివాటం
గ్రేడ్–2 హెచ్‌డబ్ల్యూఓ నుంచి గ్రేడ్–1 వసతి గృహ సంక్షేమాధికారులుగా పదోన్నతులు పొందేందుకు రూ.లక్షల్లో చేతులు మారినట్లు ఆ శాఖ సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఒక్కో పదోన్నతిపై రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పదోన్నతులు పొందిన వారిలో ఒకరు ఈ ఏడాది ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. అంతే కాకుండా సంఘ నాయకులుగా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నందునే ప్రమోషన్ వచ్చిందని మిగిలిన అధికారులు చెబుతున్నారు. సీనియారిటీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమోషన్లలో అవకతవకలు, అవినీతి వ్యవహారాలు, అడ్డగోలు పనితీరు వంటివి బీసీ సంక్షేమ శాఖకు పరిపాటిగా మారిందనే అపవాదు ఉంది. జిల్లాకు చెందిన మంత్రి పేరు చెప్పి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు పదవుల్లో ఉన్నా వారి పేరును వాడుకుని కలెక్టర్‌ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీనియారిటీ జాబితాలను పక్కన పెట్టిన వైనం
నిబంధనలను బేఖాతరు చేస్తూ నిర్ణయాలు