గత ప్రభుత్వంలోనే అనుమతులు | - | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వంలోనే అనుమతులు

May 3 2025 8:29 AM | Updated on May 3 2025 8:29 AM

గత ప్

గత ప్రభుత్వంలోనే అనుమతులు

సోంపేట: మండలంలోని తీరప్రాంత మత్స్యకారుల ప్రయాణ సమస్యలు పరిష్కరించడానికి, సోంపేట మండల కేంద్రానికి వేగంగా చేరుకోవడానికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే చర్యలు తీసుకున్నట్లు ఎంపీపీ డాక్టర్‌ నిమ్మన దాస్‌ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొండిరేవు వంతెన, మహేంద్రతనయ నదిపై బ్రిడ్జిల నిర్మాణానికి జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, జిల్లా పార్టీ పెద్దలు చొరవతో గత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద జీఓ నంబరు–788తో 2023 నంబర్‌ 23న అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. కొండి రేవు బ్రిడ్జికి రూ.3.45 కోట్లు, మహేంద్రతనయ నది బ్రిడ్జికి రూ.14.60 కోట్లు మంజూరయ్యాయని, టెండర్లు పిలిచే సమయానికి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని, అదే జీవోతో ప్రస్తుతం టెండర్లు ఖరారైనట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కరించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుంతుందని ఎంపీపీ స్పష్టం చేశారు.

మా పార్టీకి అనుకూలంగా ఉంటేనే పింఛన్‌

ఒంటరి మహిళ పింఛన్‌ నిలిపివేసిన టీడీపీ నేతలు

నరసన్నపేట: ‘మా పార్టీకి అనుకూలంగా ఉండటం లేదు. మాకు వ్యతిరేకంగా ఉంటున్నావు.. మా ప్రభుత్వంలో నీకు ఎందుకు పింఛన్‌ ఇస్తాం.. నువ్వు మా పార్టీకి అనుకూలంగా ఉంటేనే పింఛను ఇప్పిస్తాం’ అంటూ టీడీపీ నేతలు తన పింఛన్‌ ఆపేశారని నరసన్నపేట మండలం రావులవలసకు చెందిన వెలమల శకుంతల అనే ఒంటరి మహిళ వాపోయింది. రెండు నెలలుగా పింఛన్‌ ఇవ్వలేదని, మే నెలలో ఇస్తామని అధికారులు హామీనిచ్చారని, ఇప్పుడు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా స్థానిక ఎమ్మెల్యే ఆపమని చెప్పినందునే ఇవ్వలేదని అంటున్నారని కన్నీటిపర్యంతమైంది. ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదలైనా టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పంపిణీ చేయకుండా నిలిపేశారని వాపోయింది. ఈ విషయమై ఎంపీడీఓ మధుసూదనరావు వద్ద ప్రస్తావించగా పింఛన్‌పై పిర్యాదు వచ్చినందున నోటీసు ఇచ్చి విచారణ చేయించామని, ఒక ఇంట్లోనే కుటుంబంతో నివాసముండటంతో పింఛన్‌ నిలుపుదల చేశామని చెప్పారు.

వివాహిత

అనుమానాస్పద మృతి

కంచిలి: మండల కేంద్రం కంచిలిలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. గురువారం రాత్రి వరకు మెయిన్‌రోడ్డులో తమ కుటుంబానికి చెందిన కూరగాయల షాపులో చలాకీగా ఉన్న ఆమె శుక్రవారం ఉదయానికి ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. ఈమె భర్త ఉపాధి కోసం వలస వెళ్లడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటోంది. ఆర్థిక వ్యవహారాలే మృతికి కారణమని తెలుస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో గురువారం అర్ధరాత్రి వరకు ఇంట్లో ఘర్షణ చోటుచేసుకొందని, తర్వాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. మృతురాలు కన్నవారు కూడా కంచిలిలోనే ఉంటున్నారు. కాగా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, భర్త రాకుండానే ఆదరాబాదరాగా అంత్యక్రియలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

కంచిలిలో మాయం..

కోయంబత్తూరులో ప్రత్యక్షం

కాశీబుగ్గ: కంచిలి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ బొడ్డేపల్లి ధనలక్ష్మి ఐదు రోజుల కిందట అనుకోకుండా తమిళనాడు వెళ్లే రైలు ఎక్కింది. కోయంబత్తూరులో దిగడంతో అక్కడి స్థానికులు, పోలీసులు చేరదీశారు. ఇంతలో ఆన్‌లైన్‌ పోలీసింగ్‌ వారికి ఆమె ఆచూకీ మ్యాచ్‌ అవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు కోయంబత్తూరు వెళ్లి శుక్రవారం స్వగ్రామం కంచిలికి తీసుకువచ్చారు.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

రణస్థలం: జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొట్టిన ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.40 గంటల సమయంలో జె.ఆర్‌.పురం బస్‌స్టేషన్‌ సమీపంలో విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. లారీ డ్రైవర్‌ గమనించక 50 మీటర్ల వరకు కారును ఈడ్చుకెళ్లాడు. అదృష్టవశాత్తు కారులో ఉన్న నలుగురికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఉన్న నలుగురు విశాఖపట్నం నుంచి జలుమూరు వెళుతున్నారు. ఘటనా స్థలాన్ని ఏఎస్సై ఉమామహేశ్వరరావు పరిశీలించి ట్రాఫిక్‌ చక్కదిద్దారు.

గత ప్రభుత్వంలోనే   అనుమతులు  1
1/2

గత ప్రభుత్వంలోనే అనుమతులు

గత ప్రభుత్వంలోనే   అనుమతులు  2
2/2

గత ప్రభుత్వంలోనే అనుమతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement