
ట్రాక్టర్ ఢీకొనడంతో మహిళకు గాయాలు
ఇచ్ఛాపురం: మున్సిపాలిటీలోని వీకేపేట రోడ్‌లో ఒక ట్రాక్టర్ స్కూటీని ఢీకొనడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం అత్యంత రద్దీగా ఉన్న వీకేపేట రోడ్‌లో రత్తకన్న వైపు నుంచి మార్కెట్ వైపు ఒక వ్యక్తి ట్రాక్టర్‌ని వేగంగా నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న స్కూటీనీ తప్పించే క్రమంలో ఢీకొన్నాడు. దీంతో స్కూటీ నడుపుతున్న పెద్ద ఆకుల వీధికి చెందిన కిల్లంశెట్టి శరణ్య అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండడం కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం అందుకున్న పట్టణ ఎస్‌ఐ ముకుందరావు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సవరాశి దుదిష్టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.