
అమరావతి కోసం ఆపసోపాలు
● మోదీ సభకు జనాలు తరలించే బాధ్యత అధికారులకు అప్పగింత
● నియోజకవర్గానికి 500 మంది టార్గెట్
● ప్రతి బస్సుకు వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి కేటాయింపు
● సభకు వెళ్లాక ఫొటోలు పెట్టాలని హుకుం
సాక్షి ప్రతినిఽధి, శ్రీకాకుళం: అమరావతి సభ.. అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రధానమంత్రి మోదీ హాజరయ్యే సభకు ఇక్కడి నుంచి జనసమీకరణ చేసి తీసుకెళ్లారు. జనాల్ని ఒప్పించి తీసుకెళ్లడానికి అధికారులు ఆపసోపాలు పడ్డారు. డ్వాక్రా మహిళలకు, ఉపాధి మేట్‌లకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గానికి 500 మందిని సమీకరించాలని మంత్రులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో స్పందన లేకపోవడంతో అరకొరగా సమీకరణ చేసి తీసుకెళ్లారు. ఒక్కొక్క బస్సుకు వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శిని కేటాయించారు. బస్సు అమరావతికి చేరుకున్నాక ఫొటోలు తీసి పెట్టాలని హకుం జారీ చేశారు. ఏమాత్రం తేడా వచ్చినా సంబంధిత వీఆర్‌ఓ, కార్యదర్శులే బాధ్యతని చెప్పారు.
పెద్ద ఎత్తున బస్సుల సేకరణ..
అమరావతి సభకు జనాల్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులనే కాకుండా వివిధ విద్యా సంస్థల ప్రైవేటు బస్సులను వదల్లేదు. ఇప్పటికే జనాల తరలింపు కోసం జిల్లా నుంచి 55 ఆర్టీసీ బస్సులను తీసుకున్నారు. వాటిన్నింటిని అమరావతి చుట్టు పక్కల జిల్లాలకు పంపించేశారు. దీంతో ఆయా రూట్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
అంచనాలు తలకిందులు..
ఒక్కొక్క మండలం నుంచి మూడేసి బస్సుల్లో జనాల్ని తరలించాలని తొలుత ఆదేశించినా స్పందన కనిపించలేదు. బస్సు ఏర్పాటు చేసినా, భోజనాలు పెట్టినా, దారి ఖర్చులు ఇచ్చినా బయలుదేరలేమని చాలామంది చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు. చివరి నిమిషంలో ఉపాధి మేట్‌లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా కొందరిని బయలుదేరించారు.
సదుపాయాలపై స్పష్టతేదీ?
జనాల్ని సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుందే తప్ప తీసుకెళ్లే వారికి భోజన, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా జిల్లాకు కేటాయించలేదు. దీంతో తహశీల్దార్లు, ఎంపీడీఓలు తమ జేబుల్లో నుంచి కొంతపెట్టారు. మిగతాది బస్సుల్లో లైజనింగ్ అధికారులుగా వెళ్లిన కార్యదర్శి, వీఆర్‌ఓలు చూసుకోవాలని ఒప్పించారు. గురువారానికి సరిపడా భోజనం, రూ.10 వేలు చొప్పున తహశీల్దార్, ఎంపీడీవోలు ఇచ్చారు. శుక్రవారం పరిస్థితి ఏంటన్నదానిపై స్పష్టత లేదు.