కాలువ భూమి సమర్పయామి
శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025
లావేరు మండలం బుడతవలస, తామాడ రెవెన్యూ పరిధిలో అన్నీ ఆక్రమణలేనని అధికారులు తేల్చి చెప్పారు. ఈ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు చేసిన కబ్జాపై ‘సాక్షి’లో ఈ నెల 20వ తేదీన ‘కాలువ భూమి.. సమర్పయామి’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. చదును చేసిన ఆక్రమిత భూములను రెవెన్యూ అఽధికారులు గురువారం పరిశీలించారు. కొలతలు వేసి ఆక్రమణలను గుర్తించారు.
ఆక్రమణలివే..
● లావేరు మండలం బడుతవలస, తామాడ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను, రస్తాను, గెడ్డ పోరంబోకు ఆక్రమించినట్టు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని వీఆర్‌ఓలు, గ్రామ సర్వేయర్లు తేల్చారు.
● బుడతవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు గల 113/1, 113/2, 113/3, 113/4, 113/5లో గతంలో పలువురికి డీ పట్టాలు ఇచ్చారు. వీటిని సాగు చేయడం లేదు. సమగ్ర భూ సర్వే చేసినప్పుడు వీరంతా అందుబాటులో కూడా లేరు. దీంతో అవన్నీ ప్రభుత్వ భూములే (గయాలు) అని రికార్డుల్లో పేర్కొన్నారు.
● ఇప్పుడా 4.57 ఎకరాల భూములను టీడీపీ నాయకుడు ముళ్ల సాయి ఆక్రమంగా చదును చేసేసి అనుభవంలోకి తెచ్చుకున్నారు.
● అదే విధంగా ఈ భూములకు ఆనుకుని ఉన్న 28 సెంట్ల ప్రభుత్వ రస్తాను కూడా ఆక్రమించి చదును చేసేశారు.
● అదేవిధంగా తామాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 105–1లో సాగునీటి కాలువ ఉంది. దాన్ని కూడా కొందరు ఆక్రమించారు. దీంట్లో కొమ్మి నీలవేణి పేరుతో ఎకరా వరకు, కొమ్మి శాంతి పేరుతో 15సెంట్లు, పురుషోత్తపు ఆదినారాయణ అనే వ్యక్తి పేరుతో 10సెంట్లు ఆక్రమించారు. ఇవన్నీ ‘సాక్షి’లో కథనం వచ్చాక పరిశీలించి, ఆక్రమణలని తేల్చారు.
చదును చేసిన ముళ్ల సాయి స్టేట్‌మెంట్ రికార్డు
ప్రభుత్వ భూములను అక్రమంగా చదును చేసిన దానిపై టీడీపీ నాయకుడు ముళ్ల సాయిని రెవెన్యూ అధికారులు విచారణ చేశారు. మీరెలా చదును చేస్తున్నారని, మీకు సంబంధమేంటి? అని, మీకెలా భూములొచ్చాయని ఆరాతీశారు. దానికి ఆయన తెలివిగా వ్యవహరించి, డీ పట్టా దారులు చదును చేయమని చెబితే చేశానని, దాని కోసం తమకు సొమ్ము ఇస్తున్నారని వివరణ ఇచ్చారు. పక్కనే ఉన్న రస్తాను ఎలా చదును చేశారని అడిగితే దానికి తనకు తోచిన సమాధానం ఇచ్చారు. ఇదంతా రికార్డు చేసి తహసీల్దార్‌కు అందించేందుకు నివేదిక సిద్ధం చేశారు.
అసైన్డ్‌దారులకు పిలుపు
సమగ్ర భూసర్వేలో ప్రభుత్వ గయాలు 4.57ఎకరాలు చూపిస్తుండగా, వాటిలో తమ పట్టా భూములు ఉన్నాయని కొందరు సమాచారం ఇవ్వడంతో వారంతా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పట్టాలు చూపించాలని, సక్రమంగా ఉంటే అప్పగించడానికి, లేదంటే ప్రభుత్వ భూములుగానే పరిగణించడానికి, ఒకవేళ అమ్ముకుంటే పీఓటీ కింద స్వాధీనం చేసుకునే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఏదైనా శుక్రవారం జరిగే పట్టాల పరిశీలనలో తేలుతుంది. ఇదిలా ఉండగా, ఇదే భూమిలో కొంత రహదారి కూడా ఉంది. అది కూడా ఆక్రమణకు గురైంది. దీని బాగోతం కూడా బయటపడనుంది.
న్యూస్‌రీల్
‘సాక్షి’ కథనంతో
రంగంలోకి రెవెన్యూ అధికారులు
బయటపడిన టీడీపీ నాయకుడి నిర్వాకం
4.57 ఎకరాల ప్రభుత్వ భూములు దర్జాగా చదును
28 సెంట్ల దారి సైతం కబ్జా
శ్రీకాకుళం
శ్రీకాకుళం