చదును.. ఇదే అదును! | - | Sakshi
Sakshi News home page

చదును.. ఇదే అదును!

Mar 19 2025 12:41 AM | Updated on Mar 19 2025 12:39 AM

కవిటి :

మండల కేంద్రం కవిటిలో ప్రభుత్వ భూమిని కవిటి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వజ్జ రంగారావు భారీ ఖర్చుతో చదును చేయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. చదును పేరిట స్థలాన్ని ఆక్రమించుకునేందుకే ఇటువంటి పనులు చేస్తున్నారని పరిసర ప్రాంత రైతులు చెబుతున్నారు. కవిటి నుంచి రాజపురం వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన రంగారావుకు కొబ్బరి తోట ఉంది. రోడ్డుకు, తోటకు మధ్య కొంత ప్రభుత్వ స్థలం కూడా ఉంది. ఈ స్థలంలో ఇటీవల ట్రాక్టర్‌తో మట్టి లోడ్లు లేశారు. మట్టి వేయ డం జేసీబీతో వేసిన చదును చేయడం ఏకకాలంలో చేపట్టారు. ట్రాక్టర్‌ వెళ్లడానికి స్థలాన్ని చదును చేయిస్తున్నానని చెబుతున్నా స్థలం అంతటినీ చదును చేయిస్తుండడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తోటకే వెళ్లేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకోవాలంటే అంత ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అంత భారీ మొత్తం ఖర్చు పెట్టి చదును చేయాల్సిన అవసరం ఏముంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అనుమతి లేకుండానే..

ప్రభుత్వ స్థలం చదును చేయించాలంటే అధికారుల ఆమోదం పొందాలి. సుమారు 40 సెంట్ల వరకు అక్కడ స్థలం ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇక్కడే విద్యుత్‌ స్టబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేశారు. అప్పట్లో రంగారావు అభ్యంతరం తెలపడంతో ఆ ప్రయత్నాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు స్థలం చదును చేయించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వ అధికారాన్ని, స్థానికంగా ఉన్న ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ అండదండలతోనే ఇదంతా జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు, ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ భూమిపై టీడీపీ నేత కన్ను

కవిటి–రాజపురం రోడ్డుపక్కన స్థలాన్ని జేసీబీతో చదును చేయించిన వైనం

స్థలాన్ని పరిరక్షించాలని కోరుతున్న స్థానిక రైతులు

పరిశీలించాం..

స్థలం చదును విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లాం. తన తోటకు వెళ్లడానికే మాత్రమే స్థలాన్ని చదును చేయిస్తున్నానని, ఆక్రమణకు కాదని రంగారావు చెప్పారు. ఒకవేళ స్తంభాలు వంటివి పాతితే శాఖాపరమైన చర్యలు చేపడతాం.

– ఎస్‌.నారాయణ, వీఆర్‌ఓ

చదును.. ఇదే అదును!1
1/1

చదును.. ఇదే అదును!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement