టెక్కలి: మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో అనైతికంగా కుటుంబాలను వెలివేసే సంఘటనలు జరగడం అప్రజాస్వామికమని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులో ఆశా వర్కర్ కుటుంబంపై జరిగిన దుశ్చర్యను మంగళవారం తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానంగా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలంతా ఎంతోమంది చిన్న స్థాయి ఉద్యోగులను బెదిరించి వారితో బలవంతంగా రాజీనామాలు చేశారని, దీనికి గెద్దలపాడులో జరిగిన ఘటనే తార్కాణమని తిలక్ గుర్తు చేశారు. గ్రామాలను, పాఠశాలలను శుభ్రం చేసే గ్రీన్ అంబాసిడర్లు మొదలుకొని మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు సిబ్బందిని బలవంతంగా తొలగించడమే కాకుండా కూటమి నాయకులంతా ఆయా ఉద్యోగాలను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. గెద్దలపాడు ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. సామాజిక బహిష్కరణకు గురైన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించకపోవడం కేవలం ఆయా పార్టీ కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాలకు అండగా నిలుస్తున్నారనే విషయం తేటతెల్లంగా మారిందన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యం చెందడంతో ఇటువంటి బెదిరింపులు, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.