
పరీక్షలు ముగిశాయి.. మూల్యాంకనమే తరువాయి
● ముగిసిన ఇంటర్మీడియెట్ రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ● 12వ రోజు 365 మంది గైర్హాజరు ● జిల్లాలో ఈ ఏడాది రెండు మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రధాన పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. ఇక మూల్యాంకనమే మిగిలి ఉంది. ఈ నెల 13వ తేదీతో ఇంటర్ ప్రథమ సంవత్సరం రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ముగియగా, శనివారంతో ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ముగిశాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే జిల్లాలో అతితక్కువ కేంద్రాల్లో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు రాసే పలు బ్రిడ్జ్ కోర్సు ల పేపర్లకు మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 17,452 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 17,087 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 365 మంది గైర్హాజరయ్యారు. ఈ ఏడాది రెండు మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదయ్యాయి.
మూల్యాంకనానికి ఏర్పాట్లు
ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రంగా ఇంటర్మీడియెట్ జవాబుపత్రాల దిద్దుబాటు ప్రక్రియ మొదలుకానుంది. నాలుగు విడతల్లో జరగనున్న ఈ స్పా ట్ వాల్యుయేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. సీసీ కెమెరాలను అమర్చడంతోపాటు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.