శ్రీకాకుళం పాతబస్టాండ్: వెలుగు వీఓఏలపై అనుచితంగా ప్రవర్తించిన డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని, ఆయన చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వీఓఏలు గురువారం నిరసన తెలిపారు. ఏపీ వీఓఏ ఉద్యోగుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. డీఆర్‌డీఏ పీడీ ధర్నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావులు మాట్లాడుతూ డీఆర్‌డీఏ పీడీ అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. వీఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వి.ధనలక్ష్మి, జి.అసిరినాయుడు మాట్లాడుతూ వీఓఏలుగా 95 శాతం మంది మహిళలే పనిచేస్తున్నారని, వారిని కించపరచడం బాధాకరమన్నారు. అనంతరం శ్రీకాకుళం పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు. కానీ మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా నిరసన తెలిపారు. తర్వాత పీడీ యూనియన్‌తో మాట్లాడడంతో ఆందోళన విరమించారు.