
శతాధిక వృద్ధునికి సన్మానం
కంచిలి: మండలంలోని కేసరపడ గ్రామానికి చెందిన వందేళ్లు పూర్తిచేసుకొన్న వృద్ధుడు ఇప్పిలి తుంబనాథంను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం ఘనంగా సన్మానించా రు. వేర్వేరు చోట్ల ఉన్న ఈ వృద్ధుని కుమారులు, కుమార్తె, మిగతా కుటుంబసభ్యులు, బంధువులు అంతా ఒకచోట చేరి సత్కరించి, గ్రామస్తులందరికీ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత ఇప్పిలి కృష్ణారావు, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మెండ హేమావతి, ఆమె భర్త ప్రకాశరావు, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతలు కప్పల యుగంధర్, మెండ మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
బలరాంపురంలో కార్డన్ సెర్చ్
గార: మత్స్యకార గ్రామమైన బలరాంపురంలో సోమవారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ ఆ ధ్వర్యంలో పోలీస్ బృందం గ్రామంలోని వీధులన్నీ జల్లెడ పట్టారు.
ఐదు వాహనాలకు ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వాటిని అదుపులోకి తీసుకున్నారు. వాహన యజమానులు సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో పత్రాలు అందించడంతో వాహనాలను తిరిగి అప్పగించారు.
పశువులను తరలిస్తున్న వాహనాలు సీజ్
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని చింతాడ సంత నుంచి అక్రమంగా తరలిస్తున్న పశువులను రూరల్ పోలీసులు సోమవారం గుర్తించారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ కేంద్రంగా తరలిస్తున్న 25 పశువులను అలాగే విశాఖ కేంద్రంగా తరలిస్తున్న 12 పశువులను పట్టుకొని గో సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. పశువులకు ఉపయోగించిన లారీలను రూరల్ పోలీసులు సీజ్ చేశారు. రూరల్ ఎస్‌ఐ వాసుదేవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద రీతిలో
జీడి కార్మికుడు మృతి
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సూదికొండ ప్రాంతంలో సోమవారం ఓ జీడి కార్మికుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఇతని మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించడం స్థానికంగా సంచలనంగా మారింది. 02వ వార్డు నెమలికొండ కొండపై ఉన్న జీడిచెట్టుకు 19వ వార్డు సూదికొండకు చెందిన గనే బాబురావు(46) మృతదేహం వేలాడుతుండడాన్ని స్థానికులు గమనించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇది హత్యా, ఆత్మహత్యా అన్న విషయం దర్యాప్తు అనంతరం తేలుస్తామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉండగా వారి సమక్షంలో మృతదేహాన్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి మార్చురీకి తరలించారు.