
విద్యార్థి ప్రశ్నకు సమాధానం ఇస్తున్న వీసీ వెంకటరావు
ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు బీఆర్‌ఏయూ వీసీ నిమ్మ వెంకటరావు అన్నారు. వర్సిటీలో నెలలో మొదటి శనివారం నిర్వహించే డయల్ యువర్ వర్సిటీ ఫోన్ ఇన్‌లైవ్ కార్యక్రమాన్ని ఉదయం పది నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. విద్యార్థుల ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. అనంతరం సమస్యలపై వీసీ సమీక్షించారు. విద్యార్థులు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరించాలని, వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. ఫోన్ ఇన్ లైవ్‌లో విద్యార్థులు ప్రధానంగా డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని, డిగ్రీ ఏడాది విధానంలో పరీక్ష రాసిన విద్యార్థులు ఇంకా పాస్ కాలేదాని వారికోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని కోరారు. డిగ్రీ 2, 4 సెమిస్టర్ ఫలితాలు విడుదలపై ప్రశ్నించారు. డిగ్రీ, పీజీ రీవాల్యూయేషన్ ఫలితాల జాప్యంపై అడిగారు. అధికారులు స్పందిస్తూ ఏటా స్పెషల్ డైవ్ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని, పరీక్ష ఫలితాలు జ్ఞానభూమి వెబ్‌సైట్ ద్వారా విడుదల చేస్తున్నామన్నారు. రీవాల్యూయేషన్ ఫలితాలు షెడ్యూల్ మేరకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపాల్ బిడ్డిక అడ్డయ్య, ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్‌భాస్కర్ పాల్గొన్నారు.
బీఆర్‌ఏయూ వీసీ వెంకటరావు