
మందసలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
మందస: తెల్లదొరలపై కత్తులు దూసిన వీరగున్నమ్మ కీర్తిని భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు పి.మధు అన్నారు. గుడారిరాజమణిపురం(వీరగున్నమ్మపురం) గ్రామానికి చెందిన వీరనారి సాసుమాన గున్నమ్మ 83వ వర్ధంతి కార్యక్రమాలు వీరగున్నమ్మపురం సమీపంలో గున్నమ్మ స్థూపం, మందసలో శనివారం జరిగాయి. మందసలోని బస్టాండ్‌లో సీఐటీయూ, గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మధు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల కాల్పుల్లో వీరగున్నమ్మతో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తెల్లదొరల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కమ్యునిస్టు పార్టీ నడిపిన గొప్ప రైతాంగపోరాటమన్నారు. నాడు, నేడు కూడా జమీందారులకు ప్రభుత్వాలు కార్పెట్లు పరుస్తున్నాయని ధ్వజమెత్తారు. గతంలో విదేశీ దురాక్రమణలు జరగ్గా, నేడు స్వదేశీ అరాచకాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రకృతి వనరులైన గాలి, నీరు, భూమి, సూర్యరశ్మి, అడవులు, గనులు అదాని కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ.. వంశధార, ఆఫ్‌షోర్ రిజర్వాయర్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, జీడి రైతులకు మద్దతు ధర క్వింటాకు రూ.16 వేలు ప్రకటించాలన్నారు. గిరిజన భూములను ఆక్రమించుకుంటున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా వీరగున్నమ్మ స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మందస పురవీధుల్లో ర్యాలీ, ప్రదర్శన చేశారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రజా సంఘాల నాయకులు మట్ట ఖగేశ్వరరావు, కె.నాగమణి, బి.కృష్ణమూర్తి, సంగారు లక్ష్మీనారాయణ, సవర ధర్మారావు, పోలాకి ప్రసాదరావు, ఎన్.గణపతి, కె.కేశవరావు, మట్ట ధర్మారావు ప్రసంగించారు. వీరగున్నమ్మ చరిత్ర ప్రచారకమిటీ నాయకులు డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు వాయలపల్లి మాధవరావు, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ హేంబాబుచౌదరి, సాసుమాన లోకేశ్వరరావులు కూడా గున్నమ్మ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు పి.మధు
ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు