
వివరాలు తెలుసుకుంటున్న అధికారులు
పొందూరు: మండలంలోని వీఆర్ గూడెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 137లో ఉన్న కొండ గ్రావెల్ క్వారీలో అక్రమ తవ్వకాలపై శనివారం మైనింగ్, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురువారం రాత్రి అక్రమ తవ్వకాలు చేస్తుండగా విద్యార్థి బగాది మణికంఠ (20) మృతి చెందడంతోనే అక్రమ క్వారీ నిర్వహణ వెలగులోకి వచ్చింది. సర్వే నంబర్ 137లో సుమారు 475.95 ఎకరాల కొండ ప్రాంతం ఉండగా, సంఘటన జరిగిన ప్రదేశంలో సుమారు 1200 క్యూబిక్ మీటర్లు తవ్వకాలు జరిపినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో మైనింగ్ డీడీ ఫణిభూషణ్ రెడ్డి, ఏడీ బాలాజీ నాయక్, సర్వేయర్ గోవిందరావు, ఆర్‌ఐ రాధ, వీఆర్వో సూర్యప్రకాశరావు ఉన్నారు. కాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై అధికారులు సమాచారం ఇవ్వకపోవడం, వాటి గురించి ప్రస్తావన లేకపోవడం విశేషం.
తుంగతంపరలో చైన్‌స్నాచింగ్
హిరమండలం: తుంగతంపర గ్రామ సమీపంలో చైన్‌స్నాచింగ్ జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతంపర గ్రామ కాలనీకి చెందిన గుజ్జాపు అమ్మలు వృత్తిలో భాగంగా రోజూ ఉదయం పూట గ్రామ సమీపంలోని చెరువుకు దుస్తులను ఉతికేందుకు వెళ్లి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వస్తుంటారు. శనివారం కూడా చెరువు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకొని పరారయ్యారు. వెంటనే బాధితురాలు కేకలు వేయడంతో దుండగులు నవతల గ్రామం వైపు ఉడాయించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.నారాయణస్వామి తెలిపారు.
పొలాల్లోకి
దూసుకుపోయిన కారు
● ముగ్గురికి స్వల్ప గాయాలు
కాశీబుగ్గ: కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన పలాస మండలం తర్లాకోట గ్రామం కాటమ్మతల్లి ఆలయ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన ముగ్గురు యువకులు గారబంద నుంచి పలాస వయా గొప్పిలి మీదుగా కారులో వస్తుండగా.. తర్లాకోట వద్ద అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకుపోయి అగిపోగా.. అందులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

బాధితురాలు అమ్మలు నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

పొలాల్లో ఉన్న కారు