
ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారులు
● ఉపాధి హామీ పథకం అమల్లో రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన మండలం ● ప్రణాళికాబద్ధంగా పనుల నిర్వహణ
రణస్థలం:
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రణస్థలం మండలం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. గ్రామాల్లోనే ఉపాధి కల్పించి వలసలు నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా మండల వ్యాప్తంగా 34 పంచాయతీల్లో ప్రణాళికాబద్ధంగా ఉపాధి పనులు సాగాయి. జాబ్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరూ కనీసం పది రోజుల నుంచి వంద రోజులు వరకు పని చేయడంతో రణస్థలం మండలం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు కై వసం చేసుకుంది.
అత్యధికంగా చేపట్టిన పనులివే
●చెరువులో పూడికతీతలు ●తోటల్లో కందకాలు తవ్వడం ●వ్యవసాయ కాలువల్లో పూడిక తీతలు
●చిన్న సన్న రైతులకు వ్యవసాయ పనుల్లో తోడ్పాటునందించడం
●పశువుల కోనేరులో పూడికతీత పనులు
●చెరువు గట్లపై మొక్కల పెంపకం
●ఉద్యావన పండ్ల తోటలు పెంచడం
●రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం
అభినందనీయం
ఉపాధి హామీ పథకం అమలులో 2022–23గాను రణస్థలం మండలం రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలవడం అభినందనీయం. అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులను చక్కగా చేయించారు.
– గొర్లె కిరణ్‌కుమార్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే
అందరికీ పని..
రణస్థలం మండలంలో జాబ్ కార్డు కలిగిన వేతనదారులందరికీ కనీసం పది నుంచి వంద రోజుల వరకు పని కల్పించాం. వేతనాల రూపంలో ఒక్క రణస్థలానికే రూ. 22.24 కోట్లు చెల్లించాం.
– ఎం.శ్రీనివాసనాయుడు, రణస్థలం ఏపీఓ
సద్వినియోగం చేసుకున్నారు
రణస్థలం ఉపాధి హామీ వేతనదారులు సగటు పని దినాలు అత్యధికంగా చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. ఇదే తరహాలోల జిల్లా వ్యాప్తంగా పని చేసి జిల్లాను రాష్ట్రంలో ముందుస్థానంలో నిలపాలి.
– చిట్టిరాజు, డ్వామా పీడీ



