సిక్కోలు ధిక్కార పతాక | - | Sakshi
Sakshi News home page

సిక్కోలు ధిక్కార పతాక

Apr 1 2023 2:00 AM | Updated on Apr 1 2023 12:26 PM

 సాసుమాన గున్నమ్మ ఊహాశిల్పం   - Sakshi

సాసుమాన గున్నమ్మ ఊహాశిల్పం

ఆ భూమిపై పడిన నెత్తుటి చుక్కలు.. ఆ తర్వాతి రైతాంగ ఉద్యమాలకు చుక్కానిగా మారాయి. ఆ యుద్ధంలో ఎగసిపడిన ఆగ్రహావేశాలు.. నేటి పోరాటాలకు నినాదాలై జీవం పోసుకున్నాయి. తూటాలకు ఎదురెళ్లిన సామాన్యుల సాహసం.. శ్రీకాకుళ సాయుధ విప్లవానికి బీజం వేసింది. ఆ ఒక్క తిరుగుబాటు గున్నమ్మను వీర గున్నమ్మగా మార్చింది, గుడారి రాజమణిపురం అనే పేరును చెరిపేసి వీరగున్నమ్మపురం అనే పేరును చరిత్ర పుటలకిచ్చింది. జమీందార్‌ వెన్ను కూడా వణుకుతుందని నిరూపించింది. నిలబడి కలబడితే తుపాకులు పట్టుకున్న వారైనా నేలకూలుతారని చెప్పింది. ఒక నిండు గర్భిణి సారథ్యంలో జరిగిన ఈ పోరాటాన్ని గుర్తు చేసుకుని ముందు తరాలకు అందించడం అన్ని తరాల వారి కర్తవ్యం.

మందస: సాసుమాన గున్నమ్మ.. ఈ పేరు చాలా మందికి కొత్త కావచ్చు. వీర గున్నమ్మ అని చెబితే తెలియని వారుండరు. వీరనారిగా పేరుపొందిన సాసుమాన వీరగున్నమ్మ స్వగ్రామం మందస మండలం గుడారి రాజమణిపురం. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఆమె మరణించి నేటికి 83 ఏళ్లు పూర్తయ్యాయి. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన గున్నమ్మ ఇప్పుడు ఇంత మందికి స్ఫూర్తిగా నిలవడం వెనుక చాలా కథ నడిచింది. ఆ కథ ఎప్పటికప్పుడు ఉద్యమకారుల గుండెల్లో నిప్పు ఆరిపోకుండా కాపాడుతోంది. 1940 మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 1 తేదీ వరకు జరిగిన సంఘటనల సమాహారమే సాసుమాన గున్నమ్మ వీరగున్నమ్మగా మారిన నేపథ్యం.

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన గున్నమ్మ గర్భిణిగా ఉన్నప్పుడే ఆమె భర్త మాధవయ్య మృతి చెందారు. అప్పట్లో స్వాతంత్య్ర పోరాటంతో పాటు రైతు హక్కుల పోరాటాలు కూడా జరిగేవి. అలా 1940 మార్చి 27, 28 తేదీల్లో పలాసలో పెద్ద ఎత్తున అఖిల భారత రైతు మహా సభలు జరిగాయి. ఆ సభల స్ఫూర్తితో 1940 మార్చి 29న మార్పు పద్మనాభం నాయకత్వాన గుడారి రాజమణిపురంలో మందస సంస్థానం కిసాన్‌ మహాసభ నిర్వహించా రు. ఈ సభలో గున్నమ్మ కూడా మాట్లాడారు. జమీందారులకు వ్యతిరేకంగా నినాదమిచ్చి.. మందస కొండల్లోని రుక్కిమెట్ట అడవులోకి వెళ్లి కలప తీసుకువద్దామని పిలుపునిచ్చారు.

రైతులు కలపను నరికి ఎద్దుల బళ్లపై తీసుకు వస్తున్నారన్న సమాచారం మందస జమీందార్‌ శ్రీరాజా జగన్నాఽథరాజమణిదేవ్‌కు తెలిసి రైతులను అణచివేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకు తెల్లవారి సాయం కూడా తీసుకున్నారు. అయితే అందరి ఆంక్షలను ధిక్కరిస్తూ గున్నమ్మ కలపను ఊరికి తీసుకువచ్చారు. దీంతో మార్చి 30వ తేది రాత్రి గుడారి రాజమణిపురంలో అభినందన సభ జరిగింది. గున్నమ్మ ధైర్య సాహసాలను కిసాన్‌ నాయకులు ప్రశంసించారు. అయితే దీన్ని అప్పటి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపిసుందర గంతాయత్‌ సహించలేకపోయారు. అప్పటి సోంపేట మెజిస్ట్రేట్‌ మద్దతుతో 10మంది కానిస్టేబుళ్లను వెంటబెట్టుకుని ఏప్రిల్‌ 1వ తేదీన గుడారి రాజమణిపురం వచ్చారు. గ్రామానికి ఉత్తరాన ఉన్న పొలంలో గుమిగూడి ఉన్న ప్రజల వద్దకు వెళ్లి కలప స్వాధీన పరచాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్‌ఐ హెచ్చరించారు. రైతులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

ప్రత్యక్ష పోరాటంలో..
విషయం తెలుసుకున్న జమీందారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొంత సేపటి తరువాత మరో పోలీసు వాహనం వచ్చి పొలం పక్కన రోడ్డుపై ఆ గింది. ఒకవైపు తుపాకులతో పోలీసులు, సైనికు లు మరోవైపు బల్లేలు, ఈటెలతో రైతులు ముఖా ముఖి పోరుకు సిద్ధమయ్యారు. కడుపులో ఒక బిడ్డను మోస్తున్న గున్నమ్మ కూడా కదన రంగంలో కాలు కదిపారు. ముందుగా అదే గ్రామానికి చెందిన గూడేన నర్సింహులు, కొర్ల దాలిబందు, గొర్లె సంగాలు, గొర్లె చంద్రయ్య, నెయ్యిల మంగళ, గొర్లె కర్రెన్నలను పోలీసులు వాహనంలోకి ఎక్కించారు. అయితే ఆ వాహనాన్ని ముందకు కదలనీయకుండ గుంట భైరాగి అడ్డంగా పడుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన వీరగున్నమ్మ కూడా అధికారుల వాహనాలకు అడ్డంగా నిలబడింది. గున్నమ్మ గుండెకు పోలీసులు తుపాకులను గురిపెట్టారు.

తప్పుకోమని హెచ్చరించారు. పోలీసు అధికారి మునిలాల్‌ తుపాకీని పైకి ఎత్తా డు. అయినప్పటికీ గున్నమ్మ చలించలేదు. దీంతో ఘర్షణ తప్పలేదు. కేకలు, అరుపులు, తుపాకీ గుళ్ల శబ్దాలతో మార్మోగిపోయింది. గున్నమ్మ పొట్ట నుంచి తుపాకీ గుళ్లు దూసుకుపోయాయి. 1940 ఏప్రిల్‌ 1వ తేదీ సాయింత్రం సూర్యాస్తమయం స మయంలో గున్నమ్మ ఆ పొలంలోనే ఒరిగిపో యింది. గున్నమ్మతో పాటు గుంట బుదియాడు, కర్రి కలియాడు, గుంట చిన్ననారాయణ, గొర్లె జగ్గయ్యలు పోలీసు కాల్పుల్లో వీరమరణం పొందారు. ఆ ఘటన తర్వాత శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటానికి పురుడు పోసింది. 1988 సెప్టెంబర్‌ పదో తేదీన వీరగున్నమ్మ పేరుతో ప్రభుత్వం స్థూపంనిర్మించింది. గ్రామస్తులు గున్న మ్మ పేరుతో గ్రామంలో కళామందిరం నిర్మించుకున్నారు. దర్శకుడు గూన అప్పారావు విప్లవసేనాని వీరగున్నమ్మ అనే చిత్రాన్ని తీశారు. గున్నమ్మ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సర్పంచ్‌ కర్రి గోపాలకృష్ణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement