
గారపేట–రెడ్డిపేట రహదారిపై బైఠాయించిన కుటుంబీకులు, గ్రామస్తులు
పొందూరు: టీడీపీ నేతకు చెందిన అక్రమ క్వారీ ఓ విద్యార్థి మృతికి కారణమైంది. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన పొందూరు మండలం వీఆర్‌గూడెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతకవిటి మండలం జీఎన్‌పురం గ్రామానికి చెందిన బగాది మణికంఠ(20) శ్రీకాకుళంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి లేకపోవడంతో తల్లి వెంకటలక్ష్మి కూలి పని చేస్తూ కుమారుడుతో పాటు కుమార్తె శారదను చదివిస్తోంది. సెలవులు రావడంతో నాలుగు రోజుల క్రితం మణికంఠ పొందూరు మండలంలోని వావిపల్లిపేటలో ఉంటున్న తాతయ్య సింహాచలం ఇంటికి వచ్చాడు. చేతి ఖర్చుల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా అప్పుడప్పుడు గ్రావెల్ క్వారీ తవ్వకాల్లో పనికి వెళ్తుండేవాడు. వావిలపల్లిపేట సమీపంలోని వీఆర్‌గూడెంలో టీడీపీ నాయకుడు సువ్వారి మధుసూదనరావు అక్రమ గ్రావెల్ క్వారీ నిర్వహిస్తున్నాడు. అందులో గ్రావెల్ తీసుకెళ్లే వాహనాల నమోదు చేసే పని కోసం మణికంఠ గురువారం రాత్రి అక్కడికి వెళ్లాడు. పనిలో ఉన్న మణికంఠ పైనుంచి క్వారీ లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరగ్గా, క్వారీ నిర్వాహకులు మాత్రం శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
గుట్టురట్టు కాకుండా...
అక్రమ క్వారీలో జరిగిన ప్రమాదంలో యువకుడు చనిపోవడంతో మైనింగ్, పోలీసు డిపార్ట్‌మెంట్ల నుంచి కఠిన చర్యలు తప్పవని భావించిన నిర్వాహకులు గుట్టురట్టు కాకుండా ప్రయత్నాలు చేశారు. ఘటనా స్థలాన్ని మార్చేందుకు వ్యూహరచన చేశారు. క్వారీలో కాకుండా వేరే చోట ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని కిలోమీటరు దూరం తీసుకువచ్చి జేవీఆర్ క్రషర్‌కు 100 మీటర్ల దూరంలోకి లారీని తీసుకువచ్చి మృతదేహాన్ని లారీ కింద పెట్టేశారు.
కుటుంబీకుల ధర్నా..
యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. యువకుడు క్వారీలోనే చనిపోయాడని, కావాలనే అక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకువచ్చి పడేశారని మండిపడ్డారు. అక్రమ క్వారీల నిర్వహణతో ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ క్వారీలను, మైనింగ్‌లను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గారపేట–రెడ్డిపేట రహదారిలో ధర్నా చేపట్టారు. పొందూరు–చిలకపాలెం ప్రధాన రహదారి కావడంతో సుమారు రెండు కిలోమీటర్ల మీరకు వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్, ఎస్పీ వచ్చి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
నిర్వాహకులపై కేసు నమోదు..
మృతుడు మణికంఠ తల్లి బగాది వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ క్వారీ నిర్వాహకుడు సువ్వారి మధుసూదనరావు, లారీ డ్రైవర్ నాగరాజు, మరికొంత మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు. గురువారం రాత్రి డ్రైవర్ నాగరాజు లారీని అజాగ్రత్తగా నడిపి మణికంఠ తలపైకి ఎక్కించడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అక్రమ మైనింగ్ స్థలం అధికారులకు తెలిసిపోతుందనే భయంతో ఘటనా స్థలాన్ని మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నించారని తెలిపారు. సంఘటన స్థలాన్నే తారుమారు చేశారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.
టీడీపీ నేత అక్రమ గ్రావెల్ క్వారీలో ప్రమాదం
పనికి వెళ్లిన డిగ్రీ విద్యార్థి మృతి
విషాదంలో కుటుంబ సభ్యులు

మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

అక్రమ గ్రావెల్ క్వారీలో రక్తపు ఆనవాళ్లు