
వనుము పాపారావు (ఫైల్)
రణస్థలం: మండలంలోని లంకపేట గ్రామానికి చెందిన వనుము పాపారావు(27) ద్విచక్ర వాహనం అదుపుతప్పి విధ్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జె.ఆర్.పురం పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపారావు బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ద్విచక్ర వాహనంతో రణస్థలం నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. అదే గ్రామానికి చెందిన బి.బాలకృష్ణ అనే వ్యక్తి బైకు ఎక్కి వెనుక కూర్చున్నాడు. లంకపేట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో పాపారావు అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక కూర్చున్న బాలకృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో 108లో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాపారావుకు తల్లిదండ్రులు సూర్యనారాయణ, లక్ష్మి, తమ్ముడు రమణ ఉన్నారు. బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జి.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.