పుట్టపర్తి టౌన్: నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ యావత్ ప్రపంచానికి ఆదర్శనీయుడని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం పుట్టపర్తి పట్టణంలోని జానకీరామయ్య కల్యాణ మండపంలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ భరధ్వాజ్ హాజరై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి అంబేడ్కర్ చిత్రపటం వద్ద ఘన నివాళులర్పించారు. అనంతరం 2024–25 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరచిన సాంఘిక సంక్షేమ వసతి గృహం గురుకుల విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ దేశంలో అన్నివర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి చేశారన్నారు. భారత రాజ్యాంగం ద్వారా సమాజంలో అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించారన్నారు. కేవలం రాజ్యాంగం కారణంగానే సామాన్యులు, బడుగు బలహీన వర్గాల వారు కూడా చట్ట సభల్లో అడుగుపెడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్, ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అఽధికారి మోహన్‌రామ్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ఘన నివాళి..
బడుగుల ఆశాజ్యోతి డాక్టర్ అంబేడ్కర్ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎస్పీ సతీష్‌కుమార్ కొనియాడారు. మంగళవారం పోలీస్ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిబ్బందితో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ అంటరానితనం, వివక్ష నిర్మూలనకు అంబేడ్కర్ అలుపెరుగని పోరాటాలు చేశారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు మహేష్, వలి, రవికుమార్, ఆర్ ఎస్‌ఐలు ప్రదీప్‌సింగ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


