దోచుకునేందుకే వైద్య విద్య ప్రైవేటీకరణ
పుట్టపర్తి టౌన్: తనకు దోచి పెట్టే అస్మదీయులకు మెడికల్ కళాశాలలు కట్టబెట్టి వైద్య విద్య ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు తెరలేపారని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి ధ్వజమెత్తారు. కోటి సంతకాల ముగింపు సందర్భంగా బుదవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇందులో కొన్ని కళాశాలల భవనాలు పూర్తయి తరగతులూ కొనసాగుతున్నాయన్నారు. మరికొన్ని కళాశాలల భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రూ. 8వేల కోట్లు ఖర్చు పెడితే ఈ కళాశాలలన్నీ అందుబాటులోకి వచ్చి ఏటా 20,500 మంది పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగే అవకాశముందన్నారు. తన 18 ఏళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేని చంద్రబాబు ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా వైద్య విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారని, ఇందులో భాగంగా ప్రభుత్వ ఆధీనంలోని వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా తన అనుయాయులకు కట్టబెట్టి దోచుకునేందుకు తెరలేపారని మండిపడ్డారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో పేదలకు వైద్య విద్య దూరం కావడంతో పాటు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు ప్రతి ఒక్కరూ స్పందించి స్వచ్చందంగా సంతకాలు చేసి కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అక్రమ బిల్లులపై సంతకాలా?
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన సత్యసాయి బాబా శతయంతి ఉత్సవాల సమయంలో తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకు గాను రూ.80 లక్షలు ఖర్చు అయినట్లుగా పెట్టిన బిల్లుపై సంతకాలు పెట్టాలంటూ మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతిని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బెదిరింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. దాతలు నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే వారు వేయించిన రోడ్డుకు సంబంఽధించి కూడా బిల్లులు చేయాలని ఒత్తిళ్లు చేయడం పల్లె దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సంతకం పెట్టకపోతే బిల్డింగ్ కూలుస్తామని, చెత్త ఎత్తనివ్వకుండా అడ్డుకుంటామని, తాగునీటి సరఫరా నిలిపి వేసి ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరింపులకు దిగడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశప్ప, రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీలారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి ఫొటో సాయి, నాయకులు అవుటాల రమణారెడ్డి, గోవర్దన్‌రెడ్డి, ఎంపీపీలు శ్రీధర్‌రెడ్డి, ఏవీ రమణారెడ్డి, కన్యాకుమారి, కవిత, సాయిగీత, రవినాయక్, నరసారెడ్డి, ఈశ్వరయ్య, కేశప్ప, శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, జయప్ప, లక్ష్మీరెడ్డి, గంగాద్రి, మాధవరెడ్డి, రామాంజనేయులు, శ్రీధర్‌రెడ్డి, భాస్కర్, షామీర్ బాషా, జగన్‌మోహన్ చౌదరి, సతీష్‌రెడ్డి, సందీప్‌నాయుడు, వాల్మీకి శంకర్, రుషీకేశవరెడ్డి, నాగిరెడ్డి, రంగప్ప, భాస్కర్, మల్లికార్జున, కుళ్లాయప్పనాయక్, విజయకుమార్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి


