మహిళ దుర్మరణం
ధర్మవరం అర్బన్: తలపై ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరం మండలం బిల్వంపల్లికి చెందిన కొత్తపల్లి రాములమ్మ(55) వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తోంది. భర్త రామకృష్ణ మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అనంతపురంలో పనిముగించుకుని శుక్రవారం రాత్రి ధర్మవరానికి చేరుకున్న ఆమె స్వగ్రామానికి వెళ్లేందుకు స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ఆటో కోసం నడుచుకుంటూ వెళుతుండగా వైపు నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఘటనలో కిందపడిన ఆమె తల మీదుగా ట్రాక్టర్ చక్రం దూసుకెళ్లింది. తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ట్రాక్టర్‌ను వదిలి పారిపోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


