కొనలేం.. తినలేం!
కదిరి: కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న పచ్చిమిర్చి ధర కిలో సెంచరీ దాటింది. ప్రతి కూరలోనూ రుచి కోసం వినియోగించే టమాట ధర కిలో రూ.60 పలుకుతోంది. మొంథా తుపాను ప్రభావం జిల్లాలో పెద్దగా లేకపోయినా కూరగాయల ధరలు మాత్రం వణుకు పుట్టిస్తున్నాయి. పొరుగున ఉన్న చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల నుంచి జిల్లాకు దిగుమతి అయ్యే కూరగాయలు తుపాను కారణంగా ఆగిపోయాయి. అక్కడి పంటలు నీట మునిగి ఆ ప్రభావం జిల్లాపై పరోక్షంగా ధరల రూపంలో చూపుతోంది.
కార్తీక మాసాన.. ధరలు ఆకాశాన
వర్షాల నెపంతో వ్యాపారులు కూరగాయల ధరలను అమాంతంగా పెంచేశారు. మరోవైపు కార్తీక మాసం కలిసి రావడంతో కూరగాయలకు భారీగా డిమాండ్ నెలకొంది. ఈ మాసంలో గృహ ప్రవేశాలు, వివాహాలు లాంటి శుభ కార్యాలు ఎక్కువగా ఉండటంతో పచ్చిమిర్చి, క్యారెట్, టమాట, బీన్స్, చిక్కుడు, వంకాయ, బీరకాయ లాంటి కూరగాయల ధరలన్నీ భారీగా పెరిగాయి. ఆకు కూరల ధరలు సైతం బాగా పెరిగాయి. జిల్లా అవసరాలకు సరిపడా కూరగాయలన్నీ దాదాపు ఇతర ప్రాంతాల నుంచే దిగుమతి అవుతున్నాయి. దీంతో వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతూ సామాన్యుల జేబులు లూటీ చేస్తున్నారు. ధరల పెరుగుదలపై ప్రజలకు అండగా నిలిచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాల్సిన కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుండడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. కష్ట కాలంలో ప్రభుత్వం ఆదుకోవడం లేదని మండిపడుతున్నారు.
చుక్కల్ని తాకుతున్న
కూరగాయల ధరలు
వందకు చేరుకున్న కిలో పచ్చి మిరప
వారం రోజుల్లో భారీ వ్యత్యాసం
బెంబేలెత్తుతున్న సామాన్య జనం
జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. ఇలాంటి తరుణంలో ఏం కొనలేం.. ఏం తినలేం.. అన్నట్లుంది సామాన్యుడి పరిస్థితి.
కొనలేం.. తినలేం!


