బీజేపీ నేతపై అట్రాసిటీ కేసు నమోదు
ధర్మవరం అర్బన్: కులం పేరుతో దూషించిన బీజేపీ నేతపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ధర్మవరం వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం తెలిపారు. పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలో ఉన్న బెంగళూరు బేకరీ వద్ద సాకే రాజా ఉండగా బీజేపీ నాయకుడు జమీర్ కుమారుడు షహెన్‌షా తన అనుచరులతో వెళ్లి కులం పేరుతో దూషించడంతోపాటు కట్టెతో దాడి చేశాడు. సాకే రాజా ఫిర్యాదు మేరకు షహెన్‌షా, అతని అనుచరులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రశాంతంగా బోధనేతర ఉద్యోగుల
పదోన్నతుల కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇంటర్మీడియట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల పదోన్నతి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. కడపలోని ఆర్‌జేడీ కార్యాలయంలో శుక్రవారం చేపట్టిన ఈ ప్రక్రియను ఆర్‌జేడీ సురేష్‌కుమార్ పర్యవేక్షించారు. నాలుగు జిల్లాలకు సంబంధించి 18 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లగా పదోన్నతికి కల్పించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి నలుగురికి పదోన్నతులు దక్కాయి.
శ్రీనాథ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
● కలెక్టర్‌కు ఫ్యాప్టో నేతల వినతి
పుట్టపర్తి: కొత్తచెరువు మండలం కేశాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనాథ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు ఫ్యాప్టో నేతలు విన్నవించారు. ఈ మేరకు వినతి పత్రాన్ని శుక్రవారం డీఆర్వో సూర్యనారాయణరెడ్డికి అందజేసి, మాట్లాడారు. శ్రీనాథ్‌రెడ్డి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనలేదన్నారు. కేవలం రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని సాకు చూపి విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ గజ్జల హరిప్రసాదరెడ్డి, నాయకులు శెట్టిపి జయచంద్రారెడ్డి, వెంకట నాయుడు, పీవీ రమణారెడ్డి, బడా హరిప్రసాదరెడ్డి, శివ, ప్రతాపరెడ్డి, గౌస్ లాజం, ప్రకాష్‌రెడ్డి, సుబ్బారెడ్డి, రామమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గాలిమర తరలిస్తూ అదుపు తప్పిన లారీ
చిలమత్తూరు: గాలి మరకు సంబంధించిన టర్బైన్ బ్లేడ్ (రెక్క)ను తరలిస్తున్న ఓ భారీ లారీ శుక్రవారం తెల్లవారు జామున చిలమత్తూరు మండలం లాలేపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై అదుపు తప్పింది. సుమారు 30 టన్నుల బరువున్న టర్బైన్ బ్లేడ్ నేలకొరుగుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్లను తాకడంతో లారీ బోల్తాపడకుండా ఆగిపోయింది. ఆ సమయంలో ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు వాహనాలను మళ్లించి, ట్రాఫిక్ పునరుద్ధరించారు. కాగా లారీ నెంబరు కనపడకుండా కప్పి ఉంచడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీ నేతపై అట్రాసిటీ కేసు నమోదు
బీజేపీ నేతపై అట్రాసిటీ కేసు నమోదు


