పెన్షన్ లేదు.. ప్రత్యామ్నాయమూ చూపలేదు
కదిరి అర్బన్: ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్న అయూబ్‌కు 2021లో పక్షపాతం వచ్చింది. 1991లో సర్వీసులో చేరిన ఆయన 2021లో తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. అదే ఏడాది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నాడు. ప్రత్యామ్నాయంగా తన కుమారుడికి ఉద్యోగం కల్పించాలంటూ కారుణ్య నిమాయకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. ఐదేళ్లు గడిచినా పెన్షన్ లేదు... కారుణ్యనియాకం కింద ఉద్యోగం ఇవ్వలేదు. ఫలితంగా జీవనం దుర్భరమై ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. తనకు మందుల ఖర్చు ఎక్కువగా ఉందని కనీసం ఈపీఎఫ్ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు కన్నీటి పర్యతమవుతున్నాడు. ఈ విషయంపై పలుమార్లు మంత్రి లోకేష్‌కు, కలెక్టర్‌కు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు, పీఎఫ్ కార్యాలయ అధికారులకు, మైనార్టీ కమిషనరేట్‌కు విన్నవించినా ఫలితం లేదంటున్నాడు. తన ఆధార్ నంబర్‌కు బదులు వేరొకరి ఆధార్ నంబర్‌ను ఆర్టీసీ అధికారులు నమోదు చేయడంతో పీఎఫ్ విత్‌డ్రా, పెన్షన్ సమస్య తలెత్తినట్లు బాధితుడు వాపోయాడు. తన ఆధార్ నంబర్‌ను సరిచేయాలని అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించడం లేదని వాపోతున్నాడు. రోజురోజుకూ తన ఆరోగ్యం క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో ఉన్నతాధికారులు స్పందించి పీఎఫ్ బెనిఫిట్స్‌తో పాటు పెన్షన్ అందేలా చొరవ తీసుకోవాలని, కుమారుడికి కారుణ్యనియామకం కింద ఉద్యోగం కల్పించాలని వేడుకుంటున్నాడు.
అనారోగ్యంతో మంచాన పడిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి అయూబ్
కారుణ్యనియామకం కింద
దరఖాస్తు చేసుకున్నా దక్కని ఫలితం


