
పరిష్కార వేదికకు 75 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 75 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, ఎస్‌బీ సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మీ బిడ్డలకు అన్యాయం జరిగితే ఇలానే చేస్తారా
మీ సొంత బిడ్డలకు అన్యాయం జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా అంటూ సోమందేపల్లి పోలీసులను ఎస్పీ సతీష్‌కుమార్ నిలదీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వివరాలు.. సోమందేపల్లికి చెందిన లక్ష్మికి ధర్మవరం మండలం కుణతూరుకు చెందిన నరేంద్రరెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అనంతపురంలో కొద్ది రోజులు కాపురం ఉన్నారు. అనంతరం చోటు చేసుకున్న విభేదాల కారణంగా ఇద్దరూ ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం నరేంద్రరెడ్డి తన మేనత్త కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న లక్ష్మి తనకు న్యాయం చేయాలంటూ సోమందేపల్లి పీఎస్ ఎస్‌ఐ రమేష్‌కు ఫిర్యాదు చేసింది. అయితే అతనిపై కేసు నమోదు చేయడానికి సెక్షన్లు లేవంటూ పోలీసులు నిర్ధయగా వెనక్కు పంపారు. దీంతో గత సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీని కలసి బాధితురాలు తన గోడు వెల్లబోసుకుంది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే బాధితురాలి సమస్యకు పరిష్కారం చూపాలని సోమందేపల్లి పీఎస్ సిబ్బందిని ఆదేశించారు. అయినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో సోమవారం మరోసారి ఎస్పీని కలిసింది. దీనిపై ఎస్పీ స్పందించారు. సోమందేపల్లి పీఎస్‌కు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో మందలించారు. ఏ ఒక్క ఆడబిడ్డలకు అన్యాయం జరగకూడదని, వెంటనే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాఫీ చూపాలని ఆదేశించారు.