
సహకార బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్లపై చర్యలు
చిలమత్తూరు: మండలంలోని కోడూరు పీఏసీఎస్ పరిధిలో రైతులు చెల్లించిన రూ.20 లక్షల రుణం సొమ్ము స్వాహా చేసిన సీఈఓ నరేంద్ర కుమార్‌పై ‘రైతులను ముంచిన సొసైటీ సీఈఓ’ శీర్షికన ఈ నెల 11న ‘సాక్షి’లో వెలువడిన కథనం విదితమే. దీనిపై స్పందించిన సహకార బ్యాంక్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం గోరంట్లలోని పీఏసీఎస్ బ్యాంక్ నోడల్ అధికారి మనోహర్ విచారణ చేపట్టారు. రైతుల నుంచి సేకరించిన రూ.20 లక్షల రుణం సొమ్ము వెంటనే బ్యాంక్‌కు చెల్లించాలని సీఈఓ నరేంద్రకుమార్‌ను ఆదేశించారు. కాగా, ఈ విషయంలో సదరు సీఈఓపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే కొంత కాలంగా బ్యాంకులో జరుగుతున్న అక్రమాలపై తమకేమీ పట్టనట్లు వ్యవహరించిన ఇద్దరు అసిస్టెంట్ మేనేజర్లపై బదిలీ వేటు వేశారు.
మద్యం మత్తులో
ప్రేమ జంట హల్‌చల్
కదిరి టౌన్: స్థాయి తాయి గ్రాండ్ హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ఓ ప్రేమ జంట మద్యం మత్తులో హల్‌చల్ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోగా, వారిపై కూడా దురుసుగా ప్రవర్తించారు. వెంటనే సీఐ నారాయణరెడ్డి అక్కడకు చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకొని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. అతిగా మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం చక్రాయపేటకు చెందిన లోకేష్, అన్నమయ్య జిల్లా బి.కోత్తకోటకు చెందిన షేక్‌భానుగా గుర్తించారు. కదిరిలోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో లోకేష్ పనిచేస్తున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తన ప్రియురాలిని రప్పించుకుని ఇద్దరూ కలసి మద్యం సేవించిన అనంతరం లాడ్జిలో గది కోసం వెళ్లారు. వీరి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో గది ఇచ్చేందుకు నిర్వాహకులు నిరాకరించారు. దీంతో లాడ్జి వద్ద గొడవకు తెరతీసినట్లు తెలిసింది.
ఐటీఐలో
5వ విడత అడ్మిషన్లు
హిందూపురం టౌన్: ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)ల్లో మిగులు సీట్ల భర్తీకి 5వ విడత అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్, హిందూపురం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ మురళీధర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని అదే రోజు సాయంత్రం 4 గంటల్లోపు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలి. 17న కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.