ధర పట్టుకుంది | - | Sakshi
Sakshi News home page

ధర పట్టుకుంది

Jul 5 2025 6:12 AM | Updated on Jul 5 2025 6:12 AM

ధర పట

ధర పట్టుకుంది

ఇంత కాలం నష్టాలు చవి చూసిన పట్టుగూళ్ల రైతులు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వారం రోజులుగా పట్టుగూళ్ల ధరలు స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో పట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ధరలు మరికొంత కాలం నిలకడగా కొనసాగాలని కోరుకుంటున్నారు.

మడకశిర: జిల్లాలో మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలో బైవోల్టిన్‌ పట్టు సాగు చేసే రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో దాదాపు 20వేల మంది పట్టు రైతులు బైవోల్టిన్‌ పట్టుగూళ్ల ఉత్పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బైవోల్టిన్‌ పట్టుగూళ్ల ధరలు పెరుగుతుండడంతో హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్‌లో సందడి నెలకొంది.

గతమంతా నష్టాలే..

ఐదారు నెలలుగా పట్టుగూళ్లకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతూ వచ్చారు. కిలో బైవోల్టిన్‌ పట్టుగూళ్ల ధర రూ.600లోపే ఉండేది. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కొన్ని రోజులుగా బైవోల్టిన్‌ పట్టుగూళ్ల ధరలు క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. కిలో పట్టుగూళ్లు గరిష్టంగా రూ.600కు పైగా ధర పలుకుతోంది. ఈ నెల 2న గరిష్ట ధర రూ.655కు చేరుకుంది. 3న స్వల్పంగా తగ్గి గరిష్టంగా రూ.630తో క్రయ విక్రయాలు సాగాయి. తాజాగా మార్కెట్‌కు శుక్రవారం దాదాపు 1,541 కిలోల పట్టుగూళ్లను రైతులు తీసుకురాగా, ధర గరిష్టం రూ.648కు ఎగబాకింది.

పెరుగుతున్న క్రయవిక్రయాలు

మార్కెట్‌లో ధర నిలకడగా కొనసాగుతుండడంతో హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్‌లో క్రయ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. గత 8 రోజుల్లోనే 39,180 కిలోల బైవోల్టిన్‌ పట్టుగూళ్లు హిందూపురం మార్కెట్‌లో అమ్మకానికి రైతులు తీసుకువచ్చారు. వారం రోజుల క్రయవిక్రయాలను పరిశీలిస్తే... జూన్‌ 26న మార్కెట్‌కు 6,272 కిలోల పట్టుగూళ్లను రైతులు తీసుకువచ్చారు. అలాగే అదే నెల 27న 7,140 కిలోలు, 28న 6,847 కిలోలు, 29న 7,130 కిలోలు, 30న 4,061 కిలోల చొప్పున బైవోల్టిన్‌ పట్టు గూళ్ల క్రయవిక్రయాలు సాగాయి. ఈ నెల 1న 1,705 కిలోలు, 2న 3,641 కిలోలు, 3న 2,384 కిలోల పట్టు గూళ్లను మార్కెట్‌లో రైతులు విక్రయించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తుండడంతో పట్టుగూళ్ల ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఏర్పడింది.

ప్రోత్సాహక ధనం విడుదలపై నీలి నీడలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో పట్టు పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బైవోల్టిన్‌ పట్టు రైతులకిచ్చే ప్రోత్సాహక ధనాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ నయా పైసా కూడా చెల్లించలేదని వాపోతున్నారు. ప్రభుత్వ పట్టుగూళ్ల మార్కెట్లలో విక్రయించే బైవోల్టిన్‌ పట్టుగూళ్లకు ప్రతి కిలోకు రూ. 50 చొప్పున ప్రోత్సాహక ధనాన్ని ప్రభుత్వం అందించాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఈ ప్రోత్సాహక ధనాన్ని చెల్లించలేదు. దీంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రోత్సాహక ధనాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని పలుమార్లు విజయవాడకు పట్టు రైతుల సంక్షేమ సంఘం నాయకులు వెళ్లి కూటమి ప్రభుత్వ పెద్దలను కలసి విన్నవించారు. అయినా ఫలితం దక్కలేదు.

క్రమేణ పెరుగుతున్న బైవోల్టిన్‌ పట్టుగూళ్ల ధరలు

కొన్ని రోజుల క్రితం కిలో రూ.600 లోపే,,

తాజాగా రూ.655 వరకు గరిష్ట ధర

ధర పట్టుకుంది 1
1/1

ధర పట్టుకుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement