
ప్రాణం తీసిన అతివేగం
గుత్తి రూరల్: అతివేగం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో పెళ్లిబృందం కారును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికుమారుడితో సహా ఆరుగురుగాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రిలోని గాజులపాలెంకు చెందిన రాజేష్ వివాహం వజ్రకరూరులో గురువారం జరగనుంది. బుధవారం పెళ్లి కుమారుడు రాజేష్ బంధువులతో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరారు. గుత్తి మండలం జక్కలచెరువు శివారు మలుపులో ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయిన ఇన్నోవా కారును రాజస్థాన్ నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన కారు డ్రైవర్ జబ్బార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కుమారుడు రాజేష్‌తో పాటు బంధువులు ఉమాదేవి, సరోజ, ఎన్.శ్రీనివాసులు, నారాయణమ్మ, శ్రీనివాసులు గాయపడ్డారు. వీరిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉమాదేవి, నారాయణమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి పంపించారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సురేష్ పరిశీలించి, కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో అటెండర్ దుర్మరణం
గుంతకల్లు: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ కార్యాలయ అటెండర్ షేక్ మహబూబ్‌బాషా (25) దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోమినాబాద్‌కు చెందిన ఖాజా, మున్నీ దంపతుల కుమారుడు మహబూబ్‌బాషా ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్ పని చేస్తున్నారు. ఇటీవలే డిప్యుటేషన్‌పై వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా బదిలీ అయ్యారు. రోజూ డ్యూటీకి ద్విచక్రవాహనంపై వెళ్లి వచ్చేవారు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్రవాహనంలో గుంతకల్లుకు బయల్దేరిన మహబుబ్‌బాషా మార్గమధ్యం కమలపాడు వద్ద వేగంగా వస్తున్న జీటీ ఆటో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటో బోల్తా పడుటంతో గుంతకల్లులోని హౌసింగ్ బోర్డుకు చెందిన అబ్దుల్ రజాక్, అతని కూమరుడు రోషన్ గాయపడ్డారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మైమూన్ ఆస్పత్రికి వెళ్లి అటెండర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రమాదేవి మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ప్రాణం తీసిన అతివేగం

ప్రాణం తీసిన అతివేగం