
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
తాడిమర్రి: నిడిగల్లు గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. పోలీసుల కథనం మేరకు... ధర్మవరానికి చెందిన షబ్బీర్ బుధవారం ఉదయం కారులో ఎరువులు వేసుకుని దాడితోటలో ఓ రైతుకు అందించి తిరిగి ధర్మవరం వెళుతున్నాడు. నిడిగల్లు సమీపంలోని చింతతోపు వద్దకు రాగానే కారు అదపుతప్పి సోలార్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరగ్గానే బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్‌కు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
ఉగ్రవాదాన్ని అంతమొందించాలి
గుంతకల్లు: ఉగ్రవాదాన్ని అంతమొందించేందకు ప్రభుత్వం కృషి చేయాలని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా కోరారు. బుధవారం గుంతకల్లులోని డీఆర్‌ఎం కార్యాలయంలో యాంటీ టెర్రిరిజంపై ఉద్యోగులతో డీఆర్‌ఎం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత పిచ్చితో ఉగ్రవాదులు చేసే దుశ్చర్యలకు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, ఆర్‌పీఎఫ్‌లు తదితరులు పాల్గొన్నారు.
బాలికపై అత్యాచారయత్నం
హిందూపురం: ఆరుబయట ఆడుకుంటున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు విన్న స్థానికులు గమనించి అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వివరాలిలా ఉన్నాయి. హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ బాలిక ఆడుకుంటోంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి తినుబండారాల ఆశ చూపి పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, బంధువులు గమనించి పరుగున వచ్చారు. వారిని చూసి ఆ వ్యక్తి బయటకు పరుగులు తీసినా.. వెంటాడి పట్టుకున్నారు. దేహశుద్ధి చేసిన అనంతరం రూరల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు