లేపాక్షి: మండలంలోని చోళసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాగానిపల్లికి చెందిన శివప్ప(56) నీట మునిగి మృతిచెందాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న నీటి కుంట వద్దకు బహిర్భూమి కోసం వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి కుంటలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి ఊపిరి ఆడక మృతి చెందాడు. శివప్పకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
‘బెట్టింగ్’ అప్పులు తీర్చలేక యువకుడి పరారీ
బత్తలపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఓ యువకుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇల్లు విడిచి పారిపోయాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామానికి చెందిన చింతపంటి చెన్నారెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో బెట్టింగ్‌కు పెట్టుబడుల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఈ అప్పులకు వడ్డీల భారం పెరగడంతో తీర్చలేక ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. బంధువులు, సన్నిహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి చెన్నారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో గేదె మృతి
చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రంలో విద్యుదాఘాతానికి గురై మంగళవారం గేదె మృతి చెందింది. వివరాలు.. చెన్నేకొత్తపల్లికి చెందిన ఓబుగారి సుబ్బిరెడ్డి పాడి పెంపకంతో కుటుంబాన్ని పోషించుకొనే వాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పచ్చగడి పెరగడంతో మేత కోసం రెండు గేదెలను గ్రామ నడిబొడ్డులో ఉన్న బయలు ప్రాంతానికి వదిలాడు. గేదెలు పచ్చగడ్డిని మేస్తూ ఉండగా అందులో ఒక గేదె సమీపంలో ఉన్న విద్యుత్ స్థంభానికి ఏర్పాటు చేసిన స్టే వైర్‌ను తాకింది. స్టేవైర్‌కు విద్యుత్ ప్రసరించడంతో గేదె షాక్‌తో అక్కడి కక్కడే మృతి చెందింది. ఘటనలో రూ.80 వేలు నష్టపోయినట్ల బాధితుడు వాపోయాడు.
వ్యక్తిపై కేసు నమోదు
గార్లదిన్నె: ప్రధాని నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... కల్లూరుకు చెందిన మహబూబ్‌బాషా సోషల్ మీడియాలో దేశ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టాడన్నారు. దీనిపై ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.