
ముగిసిన పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. శ్రీవారి ఉత్సవమూర్తులను భారీ ఊరేగింపుతో ఆమిద్యాల గ్రామానికి తరలించారు. ఉదయం ఆలయంలో స్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత లక్ష్మీనృసింహుడి ఉత్సవ మూర్తులను ప్రత్యేక పల్లకీలో ఆమిద్యాలకు తరలించారు. ఆమిద్యాల గ్రామంలోని పెన్నోబుళేసుడి ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడ కొలువుదీర్చారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సాకేరమేష్ బాబు, అర్చకులు పాల్గొన్నారు.
హుండీ కానుకల లెక్కింపు..
పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ హుండీ కానుకలు మంగళవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి పాండురంగారెడ్డి, దేవదాయ శాఖ పర్యవేక్షణ అదికారులు వన్నూరుస్వామి, కె.రాణి, ఆలయ ఈఓ సాకే రమేష్‌బాబు ఆధ్వర్యంలో కానుకలు లెక్కించారు. 13 రోజులకు గాను కానుకల రూపంలో రూ.15.85 లక్షలు, అన్నదానం హుండీ ద్వారా రూ.8,212 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ తెలిపారు. కార్యక్రమంలో గుంతకల్లుకు చెందిన హనుమాన్ సేవా సమితి, ఉరవకొండ షిర్డీ సాయి ఆలయం, అనంతపురం ఫస్ట్‌రోడ్డు శివాలయం సేవా సమితి వారు పాల్గొన్నారు.