
పోలీసుల అత్యుత్సాహం..
సాక్షి, పుట్టపర్తి/గాండ్లపెంట/కదిరి టౌన్: అధికార మదంతో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యానికి పాతర వేశారు. మండల పరిషత్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి తమ పార్టీ తరఫున ఒక్క ఎంపీటీసీ ఉన్నప్పటికీ బరిలో నిలిచి.. ప్రత్యర్థి పార్టీలోని సభ్యులను బెదిరించి ఓట్లు వేయించుకుని పీఠం కైవసం చేసుకున్నారు. ప్రలోభాలు, డబ్బులు, పదవులు ఆఫర్ చేసి.. వినకుంటే బెదిరించి తమ వైపు తిరిగేలా చేశారు. అక్రమ కేసులు, దాడుల భయం చూపి పార్టీ ఫిరాయించేలా చేసి.. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులను దక్కించుకున్నారు. అధికార మదంతో అధికారులను అడ్డు పెట్టుకుని మెజారిటీ లేకున్నా.. గెలిచినట్లు ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. టీడీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన పోలీసులు వారికి పరోక్షంగా.. ప్రత్యక్షంగా సహకరిస్తూ వంతపాడారు. రామగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద టీడీపీ గూండాలు మీడియా ప్రతినిధులను సైతం అడ్డుకుని వెనక్కుపంపారు. పైగా.. నిబంధనలను తుంగలో తొక్కి పోలీసులు రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లడం విమర్శలకు దారి తీస్తోంది.
ఒక్క సీటుతో చక్రం..
కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలుండగా, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఆరు స్థానాలు దక్కించుకోగా, టీడీపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక టీడీపీ నాయకులు ఎంపీపీ పీఠంపై కన్నేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేశారు. దీంతో ముగ్గురు టీడీపీ కండువా కప్పుకున్నారు. సోమవారం జరిగిన ఎన్నికను ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు (వైఎస్సార్ సీపీ) బహిష్కరించారు. మిగతా నలుగురు ఎంపీటీసీలు హాజరయ్యారు. టీడీపీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్క ఎంపీటీసీ సభ్యుడు (సోమయాజులపల్లి) జయరామిరెడ్డి ఎంపీపీగా సోమశేఖరరెడ్డి పేరును ప్రతిపాదించగా, మలమీదపల్లి ఎంపీటీసీ సభ్యురాలు భారతి బలపరిచారు. దీంతో ఎంపీపీగా సోమశేఖరరెడ్డి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. కాగా, ఎంపీపీ పదవి ఆఫర్ చేసి ముగ్గురు ఎంపీటీసీలను లాక్కున్న టీడీపీ నేతలు...అందులో కేవలం ఒకరికి మాత్రమే పదవి కట్టబెట్టి.. మిగతా ఇద్దరికీ మొండిచెయ్యి చూపారు.
ఫిరాయింపు ఓట్లతో మున్సిపాలిటీ కై వసం..
కదిరి మున్సిపాలిటీలో 36 వార్డులుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 30 స్థానాల్లో విజయఢంకా మోగించింది. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకోగా, మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దీంతో చైర్మన్‌గా నజీమున్నీసా, వైస్ చైర్మన్లుగా కొమ్ముగంగాదేవి, రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరగానే టీడీపీ నాయకులు మున్సిపల్ పీఠంపై కన్నేశారు. కేవలం ఐదుగురు సభ్యులతో చైర్మన్ గిరీ కోసం నిసిగ్గురాజకీయానికి తెరతీశారు. బరితెగించి...భయపెట్టి పలువురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను తమవైపునకు తిప్పుకుని పచ్చకండువా వేశారు. అవిశ్వాస తీర్మానం ద్వారా వైఎస్సార్ సీపీకి చెందిన చైర్మన్, వైస్ చైర్మన్లను దించేశారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించగా... మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన దిల్షా దున్నీషా, వైస్ చైర్మన్లుగా 21వార్డు కౌన్సిలర్ సేగు సుధారాణి, 19 వార్డు కౌన్సిలర్ మద్దేపల్లి రాజశేఖర ఆచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితో ఆర్డీఓ వీవీఎస్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఈ అప్రజాస్వామ్య ఎన్నికను నిరసిస్తూ వైఎస్సార్ సీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు బహిష్కరించారు.
రామగిరిలో అభ్యర్థి లేకున్నా..
రామగిరి మండలంలో మొత్తం 10 స్థానాలకు గానూ 9 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. అందులో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మరణించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీ తరఫున ఎంపీపీగా పోటీ చేసేందుకు మహిళా అభ్యర్థి లేకున్నా.. ప్రలోభాలతో పదవి దక్కించుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత భావించారు. అయితే కోరం లేక ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక సోమవారం మళ్లీ నిర్వహించారు. రిజర్వేషన్ ప్రకారం ఎంపీపీ స్థానం మహిళకు కేటాయించడం... టీడీపీ తరఫున మహిళలెవరూ విజయం సాధించకపోవడంతో టీడీపీ డైలమాలో పడింది. వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీటీసీలను భయపెట్టి, పదవులు, డబ్బులు ఆఫర్ చేసి ఎంపీపీ సీటు కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. అయితే వైఎస్సార్‌సీపీ సభ్యులు ఏ ఒక్కరూ ఎన్నికకు రాలేదు. దీంతో అభ్యర్థి లేరని.. ఎన్నికను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు అధికారి సంజీవయ్య ప్రకటించారు.
రామగిరి వైస్ సర్పంచ్‌పై రౌడీషీటర్ దాడి..
ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో రామగిరికి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ బోయ రామాంజినేయులపై రౌడీషీటర్ శివకుమార్ తన అనుచరులతో కలసి సోమవారం దాడి చేశాడు. టీ తాగేందుకని ఓ హోటల్‌కు వెళ్లగా సమీపంలో ఉన్న 30 మంది టీడీపీ శ్రేణులు ఒక్క సారిగా శివకుమార్ ఆధ్వర్యంలో రామంజినేయులును చుట్టముట్టారు. ‘‘ఇక్కడ నీకేం పని’’ అని ప్రశ్నిస్తూ పిడిగుద్దుల వర్షం కురిపించారు. అయినా పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు.
రామగిరి ఎంపీపీ ఎన్నిక జరిగే సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించారు. ఎంపీటీసీ సభ్యులతోపాటు ఎన్నికల అధికారులు, మీడియా సిబ్బందికి మాత్రమే హాలులోకి అనుమతి ఉంది. పోలీసులు సైతం ఎన్నిక గది బయటే విధులు నిర్వర్తించాలి. అయితే ఎన్నికల నియమావళిని అధికారులు తుంగలోతొక్కి ఏకంగా ఎన్నిక జరిగే గదిలోకి ప్రవేశించి వీడియోలు తీయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాక వివాదాస్పద రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ పదే పదే పోలీసులకు సలహాలు, సూచనలిస్తూ హడావుడి చేయడం గమనార్హం. అయినా ఎన్నికల అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.
గాండ్లపెంట ఎంపీపీ గజ్జల సోమశేఖరరెడ్డి
కదిరి మున్సిపల్
చైర్‌పర్సన్ దిల్షాదున్నీషా
మండల పరిషత్ ఎన్నికల్లో
నిబంధనలకు తూట్లు
బలం లేకున్నా గాండ్లపెంట ఎంపీపీ టీడీపీ కై వసం
కదిరి మున్సిపాలిటీలోనూ
ఫిరాయింపు రాజకీయం
సీట్లు లేకున్నా.. బెదిరింపులతో
పదవులు దక్కించుకున్న టీడీపీ
రామగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీసుల అత్యుత్సాహం
మహిళా అభ్యర్థి లేకపోవడంతో
రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా

పోలీసుల అత్యుత్సాహం..

పోలీసుల అత్యుత్సాహం..

పోలీసుల అత్యుత్సాహం..