
ముందస్తు మురిపెమేనా?
పుట్టపర్తి అర్బన్: ముందస్తు ‘నైరుతి’ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా చెరువుల్లో నీరు చేరింది. అయితే ఇప్పటికే ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతులను వర్షాలు ఊరిస్తుండగా...సాగుకు ముందుకు సాగలేకపోతున్నారు. కీలకమైన సమయంలో వరుణుడు ముఖం చాటేస్తే పరిస్థితి ఏమిటన్న సందిగ్ధంలో మునిగిపోయారు.
గత ఏడాదీ మురిపించి... ఆపై ముంచేసి
జూన్ సాధారణ జిల్లా వర్షపాతం 66 మి.మీ కాగా, గత ఏడాది ఏకంగా 100 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో విత్తనాలు వేశారు. అయితే ఆ తర్వాత దాదాపు 52 రోజులు చుక్కవర్షం లేదు. దీంతో విత్తనం మొలకెత్తలేదు. రైతులు అప్పులు చేసిన పెట్టిన పెట్టుబడులు నేలపాలయ్యాయి.
తాజా వర్షాలు ఊరిస్తున్నా...
ఖరీఫ్‌లో పంటలు విత్తుకునేందుకు జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు మంచి అదనుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ సారి ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాస్తవానికి మే నెలలో జిల్లా సాధారణ వర్షపాతం 42.2 మి.మీ వర్షపాతం కాగా, ఇప్పటివరకూ 94 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఇంకా వర్షసూచన చెబుతున్నారు. అలాగే కీలకమైన నైరుతీ రుతుపవనాలు ఈ సారి ముందస్తుగానే అంటే ఈనెల 27న కేరళను తాకుతాయని వారం కిందటే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. అలాగే రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఉన్నందు ఇంకా ముందుగానే అంటే 24న కేరళను తాకవచ్చని తాజాగా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ నెలాఖరుకు జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. తాజా వర్షాలతో రైతులు సాగుకు సిద్ధంగా ఉన్నా...గత ఏడాది పరిస్థితి గుర్తు తెచ్చుకుని సందిగ్ధంలో పడిపోయారు. ఇక ఈ వర్షాలకే విత్తు వేసేందుకు కొందరు రైతులు ఉత్సాహంగా ఉన్నా ప్రభుత్వం నేటికీ విత్తన పంపిణీపై దృష్టి సారించలేదు. పోనీ మార్కెట్‌లో విత్తనం కొని వేద్దామంటే ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేస్తే పరిస్థితి ఏమిటని రైతుల మనసులను తొలుస్తోంది.
29 మండలాల పరిధిలో వర్షం..
ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిలాల్లోని 29 మండలాల పరిధిలో వర్షం కురిసింది. అత్యధికంగా గుడిబండల మండలంలో 60 మి.మీ వర్షపాతం నమోదైంది. తనకల్లు 50.6, నల్లచెరువు 45.4, తలుపుల 28.2, నల్లమాడ 19.8, మడకశిర 19.6, రొళ్ల 18.2, అమడగూరు 17.6, అమరాపురం 15.6, ముదిగుబ్బ 14.6, అగళి 14.4, గాండ్లపెంట 13, గోరంట్ల 12.2, రొద్దం 10.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లోనూ 10.6 మి.మీ నుంచి 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. రానున్న రెండు రోజులూ ఉరుములు, మెరుపులు, భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఇప్పటికే అధికారులు జిల్లాలో ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.
జిల్లా వ్యాప్తంగా ముందస్తు వర్షాలు
సందిగ్ధంలో పడిన రైతులు
అదనులో వరుణుడు
ముఖం చాటేస్తాడేమోనని ఆందోళన
నేటికీ విత్తన పంపిణీ చేపట్టని
కూటమి సర్కార్

ముందస్తు మురిపెమేనా?