
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
● ఆర్‌పీఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ
ఆరోమాసింగ్ ఠాగూర్
ధర్మవరం అర్బన్: రైల్వే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్‌పీఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ ఆరోమాసింగ్ ఠాగూర్ తెలిపారు. శనివారం ఆమె స్థానిక రైల్వేస్టేషన్‌లోని ఆర్‌పీఎఫ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆర్‌పీఎఫ్ పరిధిలో ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పూర్తి చేసిన కేసుల వివరాలను ఆర్‌పీఎఫ్ సీఐ నాగేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బందికి ఏర్పాటు చేసిన భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ఆర్‌పీఎఫ్ విభాగంలో పనిచేసే మహిళలకు మరింత భద్రతను కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గుంతకల్లు డివిజన్ కమిషనర్ మురళీకృష్ణ, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ అనిల్‌కుమార్‌సింగ్, రేణిగుంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ రాజగోపాల్‌రెడ్డి, ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ రోహిత్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
కోర్టు రికార్డులు
సక్రమంగా భద్రపర్చాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు
హిందూపురం: వివిధ కేసులకు సంబంధించి కోర్టు రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు సూచించారు. కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఇటీవలే పాత న్యాయస్థాన సముదాయంలోని కోర్టులను పశుసంవర్ధక కార్యాలయ భవనంలోకి మార్పు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా జడ్జి భీమారావు, అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజతో కలిసి నూతన కోర్టు భవన సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంలోనే జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటాన్ని చూసి జిల్లా జడ్జి విస్మయం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణలో అశ్రద్ధ పనికిరాదన్నారు. అనంతరం అదనపు జిల్లా జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి పలు న్యాయస్థానాలు, న్యాయమూర్తుల గదులను పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితా లక్ష్మిహారిక, ప్రత్యేక మెజిస్ట్రేట్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
భయపెట్టి..
పోలీసులతో బెదిరించి
● పింఛన్ కోసం లంచంలో మరో ట్విస్ట్
● మహిళను బెదిరించి మరో వీడియో చేయించిన వైనం
చిలమత్తూరు: పింఛన్ మంజూరు కోసం ఓ మహిళ నుంచి ఏకంగా రూ.10 వేలు లంచం డిమాండ్ చేసిన ఘటన వైరల్ కావడంతో టీడీపీ నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. వీడియోలో మాట్లాడిన మహిళను టీడీపీ నేతలు భయపెట్టడంతో పాటు పోలీసులతోనే బెదిరించి మరో వీడియో రూపొందించి సోషల్ మీడియాలో ఉంచారు.
తీవ్ర చర్చనీయాంశమైన సాక్షి కథనం..
పింఛన్ కోసం లంచం అడిగారని, అంత డబ్బు తనవద్ద లేక చెవిదుద్దులు తాకట్టు పెట్టేందుకు వచ్చానంటూ హిందూపురం 12 వార్డుకు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తితో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌కాగా, దీనిపై శనివారం ‘సాక్షి’లో ‘పింఛన్ కోసం లంచం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కూటమి పాలనకు అద్దం పడుతున్న ఈ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు రంగంలోకి దిగారు. మరోవైపు ఉదయం నుంచే పోలీసులు, టీడీపీ ప్రజాప్రతినిధులు సదరు మహిళను నేరుగా, ఫోన్‌ల ద్వారా సంప్రదించి బెదరగొట్టేశారు. ఇక రెండో పట్టణ సీఐ కూడా ఆమెను భయపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బలవంతంగా ఆమెతో మరో వీడియో చేయించారు. అందులో తనను ఎవరూ లంచం అడగలేదని చెప్పించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ నేతలు... ఇలా ఓ మహిళను భయపెట్టి తమకు అనుకూలంగా వీడియో చేయించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.