
హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచాలి
హిందూపురం: హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులక పెంచితేనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుందని జలసాధన సమితి సభ్యులు అన్నారు. ‘సాగునీటి సమస్యలు – పరిష్కార మార్గాలు’ అంశంపై స్థానిక పెన్షనర్స్ భవన్‌లో శుక్రవారం సదస్సు జరిగింది. జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, సమితి నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. అత్యంత అల్ప వర్షపాతంలో దేశంలోనే రెండవ స్థానంలో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు హంద్రీ–నీవా వరదాయినిగా మారిందన్నారు. ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. జీడిపల్లి నుంచి దిగువకు కాలువ వెడల్పు చేయకుండానే లైనింగ్ పనులు ప్రారంభించడం వల్ల నీటి సామర్థ్యాన్ని పెంచే యోచనకు కూటమి ప్రభుత్వం సమాధి కట్టినట్లుగా తెలుస్తోందన్నారు. ఇది అప్రజాస్వామిక చర్య అని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ జీఓ జారీ చేశారని, పనులకు సంబంధించి రూ.6182 కోట్లకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ ప్రభుత్వ జారీ చేసిన జీఓను రద్దు చేయడమే కాక, 3,850 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి పరిమితం చేయడం వెనుక అంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో పక్కనే ఉన్న కృష్ణానది జలాలను కాదని, రూ.80వేల కోట్లు ఖర్చుతో పోలవరం నుంచి గోదావరి జలాలను 465 కి.మీ. దూరంలో ఉన్న బనకచర్లకు తరలించి అక్కడి నుంచి రాయలసీమకు నీళ్లు ఇస్తానని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారని ప్రశ్నించారు. పోలవరం నుంచి గోదావరి జలాల మళ్లింపు ఆలోచనను విరమించుకుని మల్యాల నుంచి జీడిపల్లి వరకు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు జీడిపల్లి నుంచి దిగువకు 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం, మడకశిర బ్రాంచ్ కెనాల్ 1,500 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా కాలువలు వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 3.45లక్షల ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందించాలన్నారు.
రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులకు రూ.50వేల కోట్లు కేటాయించి రెండేళ్లలోపు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మృతనదిగా మారబోతున్న పెన్నాను బతికించుకునేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. కృష్ణానదిపై సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మించాలనే డిమాండ్‌తో ఈ నెల 31న సంగమేశ్వరం వద్ద జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని రైతులు, మేధావులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జలసాధన సమితి నాయకులు నవీన్, జమీల్, ఆదినారాయణ, అమానుల్లా, జయరామరెడ్డి, హనుమంతరెడ్డి, జనవిజ్ఞాన వేదిక నాయకులు రాజశేఖరరెడ్డి, లెక్చరర్ గంగిరెడ్డి, తూమకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం నాయకుడు రవికుమార్, పీడీఎస్‌యూ బాబావలి, ఏఐటీయూసీ వినోద్, చలివెందుల లక్ష్మీనారాయణరెడ్డి, తిప్పేస్వామి, పలువురు ఉపాధ్యాయులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కాలువ లైనింగ్ పనులతో
భవిష్యత్తుకు సమాధి
31న కృష్ణానది సంగమేశ్వరం వద్ద బహిరంగ సభ విజయవంతం చేయండి