డ్రగ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం

May 17 2025 7:01 AM | Updated on May 17 2025 7:01 AM

డ్రగ్

డ్రగ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం

డీఎస్పీ విజయ్‌కుమార్‌

పుట్టపర్తి టౌన్‌: సమష్టి కృషితో జిల్లాను డ్రగ్స్‌ రహితంగా మారుద్దామంటూ పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్‌ పిలుపునిచ్చారు. స్థానిక సాయిఆరామం వేదికగా ఈగల్‌ యాంటీ టాస్క్‌ఫోర్ప్‌ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయికి అలవాటు పడి చాలా మంది తమ జీవితాలను నాశనంచేసుకుంటున్నారన్నారు. అలాంటి వారు తమ కుటుంబాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం తదితర వివరాలు గురించి తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 1972కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐలు సునీత, సురేష్‌, ఈగల్‌ యాంటీ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీహరి, ఎస్‌ఐ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

నిజాయితీ చాటుకున్న విద్యార్థులు

అగళి: నడిరోడ్డుపై తమకు దొరికిన సంచిలో ఉన్న నగదును పోలీసుల ద్వారా సంబంధీకుడికి అప్పగించి, విద్యార్థులు తమ నిజాయితీని చాటుకున్నారు. వివరాలు.. అగళి మండలం ఆలూడి గ్రామానికి చెందిన నరసింహ, మలుర... స్థానిక ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ఇంటర్‌ పరీక్షలు రాసి తిరుగు ప్రయాణమయ్యారు. కర్ణాటక బ్యాంక్‌ వద్దకు చేరుకోగానే నడిరోడ్డుపై ఓ బ్యాగ్‌ కనిపించడంతో తీసుకుని పరిశీలించారు. అందులో పెద్ద మొత్తంలో నగదు ఉండడంతో నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆ బ్యాగ్‌ను అందజేసి, విషయాన్ని వివరించారు. బ్యాగ్‌లో ఉన్న బ్యాంక్‌ పాస్‌ పుస్తకాన్ని పరిశీలించిన పోలీసులు ఆ నగదు గ్యార గుండానపల్లి చెందిన శివన్నది గుర్తించి, పీఎస్‌కు రప్పించుకుని ఆరా తీశారు. గ్రామంలోని మహాత్మా గాంధీ మహిళ సంఘానికి చెందిన డబ్బును అగళిలోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌లో కట్టేందుకు తీసుకువచ్చినంట్లు వివరించాడు. అయితే నగదు ఉన్న బ్యాగ్‌ను పొగొట్టుకోవడంతో దిక్కు తోచలేదని, అందులో రూ.49,310 నగదు ఉండాలని తెలిపాడు. దీంతో లెక్కించిన పోలీసులు ఆ మొత్తం అందులో ఉండడంతో విద్యార్థుల చేతుల మీదుగా ఆయనకు అందజేయించారు. నిజాయితీ చాటుకున్న విద్యార్థులను ఈ సందర్భంగా పోలీసులు అభినందించారు.

వాహనం బోల్తా.. ఒకరి మృతి

తాడిపత్రి: మండలంలోని ఇగుడూరు గ్రామం వద్ద బొలెరో లగేజీ వాహనం బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు కర్ణాటక ప్రాంతంలో కొనుగోలు చేసిన జీవాలను బొలెరో లగేజీ వాహనంలో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం ఇగుడూరు గ్రామం వద్దకు చేరుకోగానే టైర్‌ పేలడంతో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తాపడింది. ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన చాంద్‌బాషా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్‌ హుస్సేన్‌ బాషా, ఎర్రగుంట్లకు చెందిన ఆంజనేయులు, గంగప్రతాప్‌ గాయపడ్డారు. ఘటనపై రూరల్‌ పీఎస్‌ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఆటో బోల్తాపడిన ఘటనలో మరొకరు..

పామిడి: మండలంలోని రామరాజుపల్లి సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన నాగేంద్ర తన సొంత ఆటోలో కుటుంబసభ్యులతో కలసి పెన్నహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వెళ్లాడు. శుక్రవారం ఆలయం వద్ద పూజలు ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమైన వారు... పామిడి మండలం రామరాజుపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా వేగాన్ని నియంత్రించుకోలేక పోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో నాగేంద్ర కుమార్తె శైలజ (15) అక్కడికక్కడే మృతి చెందింది. నాగేంద్ర, సుదర్శన్‌, మోక్షిత, రాధమ్మకు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

డ్రగ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం1
1/1

డ్రగ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement