
ఏపీఆర్‌ఎస్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల విద్యార్థులు షైనింగ్ స్టార్–2025 అవార్డులకు ఎంపికయ్యారు. 2024–25 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలో నిర్వహించిన పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన ప్రభుత్వ పాఠశాలల్లోని టాప్ ర్యాంకర్లను ఎంపిక చేసి, షైనింగ్ స్టార్ అవార్డులను ప్రభుత్వం అందజేస్తోంది. ఈ క్రమంలో ఏపీఆర్‌ఎస్‌కు చెందిన డి.అఫ్రీద్, ఎస్.అహమ్మద్ హుస్సేన్, కె.లక్ష్మీనరసింహారెడ్డి, వై.విశ్వకిరణ్, కె.అశోక్‌కు అవార్డులు దక్కాయి. ఎంపికై న విద్యార్థులను శుక్రవారం ప్రిన్సిపాల్ ఎన్‌వీ మురళీధర్‌బాబుతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
లైనింగ్ పనులు
త్వరగా పూర్తి చేయండి
తనకల్లు: హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. మండలంలోని కొక్కంటిక్రాస్ వద్ద జరుగుతున్న లైనింగ్ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లైనింగ్ పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అనంతరం ఇంతవరకు ఎన్ని కిలోమీటర్ల పనులు చేశారని, ఏఏ యంత్రాలను పనులకు కోసం వినియోగిస్తున్నారని ఆరా తీశారు.
యువకుడి దుర్మరణం
పుట్టపర్తి అర్బన్: మండలంలోని వెంకటగారిపల్లి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బుక్కపట్నం మండలం జానకంపల్లికి చెందిన సాయినాథ్ (26) సీసీ కెమెరాల మరమ్మతు పనితో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గోరంట్ల నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి ప్రయాణమైన సాయినాథ్... వెంకటగారిపల్లి సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వామనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సంప్‌లో పడి వృద్ధురాలి మృతి
పుట్టపర్తి అర్బన్: ప్రమాదవశాత్తు నీటి సంప్‌లో పడి ఓ వృద్ధురాలు మృతిచెందింది. వివరాలు.. పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామానికి చెందిన ఫకృద్దీన్ ఇద్దరు కుమారులు ఉద్యోగ రీత్య ఇతర ప్రాంతాల్లో స్థిరపడడంతో భార్య చక్కీరమ్మ (70)తో కలిసి ప్రశాంతిగ్రామంలోని జానకీరాం కాలనీలో స్ధిరపడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సంప్‌లోని నీళ్లు తీసుకునేందుకు వెళ్లిన చక్కీరమ్మ అదుపు తప్పి అందులో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగి ఊపిరి ఆడక మృతిచెందారు. ఘటనపై పుట్టపర్తి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.
పలు మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని గుడిబండ మండలంలో అత్యధికంగా 35.2 మి.మీటర్లు, రొళ్ల 21.2, గాండ్లపెంట 20, మడకశిర 6, అగళి మండలంలో 5.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.

ఏపీఆర్‌ఎస్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు

ఏపీఆర్‌ఎస్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు