
బదిలీ నిబంధనల్లో అసంబద్ధాలను తొలగించాలి
ధర్మవరం అర్బన్: ఉపాధ్యాయ బదిలీల నిబంధనల్లో నెలకొన్న అసంబద్ధాలను తొలగించాలని ప్రభుత్వాన్ని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక సాయికృప జూనియర్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్జీటీలకు సెమీ మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. మోడల్ ప్రైమరీ స్కూళ్లలో హెచ్‌ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లకు బదులు ఎల్‌ఎఫ్‌ఎల్ పదోన్నతుల ద్వారా ఎస్జీటీలను నియమించాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల స్థాయిని దిగజార్చకుండా వారిని యూపీ, ఉన్నత పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. 2023లో రేషనలైజేషన్ అయి ప్రమోషన్ పొందిన వారికి, 2025లో రేషనలైజేషన్ అవుతున్న వారికి బదిలీల్లో అన్యాయం జరగకుండా చూడాలన్నారు. స్టడీ లీవ్‌లో ఉన్న వారి పోస్టులను వేకెంట్ చూపరాదన్నారు. అంతర్ జిల్లా బదిలీలు కూడా వెంటనే చేపట్టాలన్నారు. మూడేళ్ల లోపు రిటైర్మెంట్ ఉన్నవాళ్లను బదిలీ నుంచి మినహాయించాలన్నారు. కౌన్సిలింగ్‌కు ముందే హైస్కూల్ ప్లస్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. రాష్ట్రమంతటా ఒకేసారి ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ ద్వారా డీఎస్సీని నిర్వహించాలన్నారు. అనంతరం డీఎస్సీ మోడల్ ప్రశ్న పత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు బుక్కచెర్ల రామకృష్ణారెడ్డి, నాయకులు సి.రామకృష్ణారెడ్డి, విజయ్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నారెడ్డి, నారాయణస్వామి, సౌదామిని, శివారెడ్డి, సంజీవ్, శ్రీరామ్‌నాయక్, చిదంబరరెడ్డి, బాలకృష్ణ, రామయ్య, రమణ, ఓబిరెడ్డి, చంద్రమౌళి, లక్ష్మీనారాయణ, రామ్మోహన్‌రెడ్డి, సాలెహ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
మిట్టా కృష్ణయ్య