
సాగుకు సర్కార్ సాయం కరువు
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా ముందస్తు వర్షాలు మురిపిస్తున్నాయి. ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. సాగుకు అవసరమైన విత్తన వేరుశనగను ప్రభుత్వం సకాలంలో అందిస్తే రైతులకు ఎంతో ఉపయోగం. గత ఏడాది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముందుచూపుతో మే 20 నుంచే విత్తనకాయల పంపిణీకి రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడంతో పాటు అదే నెలలో విత్తనకాయలు అందించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం రైతులను సందిగ్ధంలోకి నెడుతోంది. బోరు బావులున్న రైతులు ఇప్పటికే పొలాలను సిద్ధం చేసుకున్నా నాణ్యమైన విత్తన కాయలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
అందుబాటులో లేని విత్తనం
సాధారణంగా ప్రతి ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వేరుశనగ, కంది, ఉలవలు, అలసంద, పెసర, మినుములు వంటి విత్తనాలను సరఫరా చేస్తుంది. జిల్లాలో ప్రధాన పంటగా వేరుశనగ సాగు చేస్తారు. ఈ రబీలో సాగు చేసిన వేరుశనగ కాయలను అధిక ధరలకు వెచ్చించి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తరలించేశారు. దీంతో ముందస్తు వర్షాలు కురిసినా వేరుశనగ సాగు చేయడానికి అవసరమైన విత్తనం అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెట్టుబడి సాయం అందేనా?
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క సంక్షేమ పథకమూ అమలు కాలేదు. దీంతో రైతుల వద్ద చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేసే నాటికి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ (రైతు భరోసా) పథకం కింద ఒకే దఫాలో రూ.20 వేలు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ముందస్తు వర్షాలతో
ఖరీఫ్ సాగుకు రైతుల సన్నద్ధం
సబ్సిడీ విత్తనకాయల కోసం
ఎదురుచూపు
సకాలంలో పంపిణీ చేయాలని వేడుకోలు
ప్రభుత్వానికి చేరిన నివేదిక
జిల్లాలో ఖరీఫ్–2025లో 2,69,152 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఒక్క వేరుశనగ పంట 1,51,824 హెక్టార్లు, కంది 28,925 హెక్టార్లు, మొక్క జొన్న 17,949 హెక్టార్లు, తదితర పంటలు అధికంగా సాగు చేయవచ్చని భావిస్తున్నారు. ఇందుకు తగినట్టుగా వేరుశనగ విత్తన కాయలు 75,895 క్వింటాళ్లు, కంది 1,275 క్వింటాళ్లు, పప్పుశనగ 796 క్వింటాళ్లు, ఉలవలు 300 క్వింటాళ్లు, పెసర, అలసంద వంద క్వింటాళ్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు చెప్పారు. అయితే ప్రభుత్వం నుంచి విత్తన కేటాయింపులు, ధర ఖరారు, పంపిణీ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం సకాలంలో విత్తనకాయలు అందిస్తే సరి.. లేకుంటే బహిరంగ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న ధరలతో విత్తనాలు కొని పంటలు సాగు చేయడం కష్టమవుతుందని రైతులు అంటున్నారు. సబ్సిడీ విత్తన పంపిణీపై త్వరగా స్పందించాలని కోరుతున్నారు.