
21న జెడ్పీ సర్వసభ్య సమావేశం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య గురువారం తెలిపారు. ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని జిల్లా పరిషత్ సమావేశ ప్రధాన మందిరంలో చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి చర్చను ప్రారంభిస్తారని, గత సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలకు సంబంధించి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో సమగ్ర వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యే సమావేశానికి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని స్పష్టం చేశారు. గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పారా లీగల్ వలంటీర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
హిందూపురం: చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు పారా లీగల్ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అదనపు జడ్జి కంపల్లె శైలజ తెలిపారు. హిందూపురం ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, హిజ్రాలు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పదో తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కల్గి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హిందూపురం జిల్లా అదనపు జడ్జి న్యాయ సముదాయంలో ఉన్న లోక్ అదాలత్ విభాగంలో అందజేయాలని తెలియజేశారు.
పాలిసెట్‌లో
94.03 శాతం ఉత్తీర్ణత
ధర్మవరం అర్బన్: జిల్లాలో పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్–2025లో జిల్లా వ్యాప్తంగా 94.03 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌బాబు తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2,704 మంది బాలురు, 1,989 మంది బాలికలు మొత్తం 4,693 మంది పరీక్షలు రాశారన్నారు. వారిలో 2,510 మంది బాలురు, 1,903 మంది బాలికలు మొత్తం 4413 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. బాలురు 92.83 శాతం, బాలికలు 95.68 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 94.03 శాతం ఉత్తీర్ణత సాధించడం హర్షణీయమన్నారు.
నేడు లేపాక్షి నంది
పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ
లేపాక్షి: భారత తపాలాశాఖ హిందూపురం డివిజన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక చేతన కన్వెన్షన్‌హాల్‌లో లేపాక్షి ఆలయ నమూనాతో పోస్టు కార్డు విడుదల చేయనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ యూ.విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరభద్రస్వామి దేవస్థానంపై ప్రత్యేకంగా రూపొందించిన పిక్చర్ పోస్టుకార్డుతో పాటు లేపాక్షి నంది నమునాతో పర్మనెంట్ పిక్టోరియల్ కాన్సిలేషన్ (పోస్టల్ మార్క్/స్టాంప్)ను ఆవిష్కరించన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.ప్రకాష్‌తో పాటు రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ వనం ఉపేంద్ర ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు.

21న జెడ్పీ సర్వసభ్య సమావేశం

21న జెడ్పీ సర్వసభ్య సమావేశం