
గ్రంథాలయాలు... విజ్ఞాన వీచికలు
పుట్టపర్తి టౌన్: వేసవి సెలవులంటే పిల్లలకు సరదా. ఆ సెలవుల కోసమే పిల్లలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వేసవి సెలవులకు నువ్వెక్కడికి వెళ్తావంటే, నువ్వెక్కడికి వెళ్తావు? అంటూ చిన్నారుల మధ్య జరిగే సంభాషణ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత బాల్యం సెల్‌ఫోన్‌కు బందీ అయింది. దీంతో బాల్యానికి ఆప్యాయత, అనురాగం, ప్రేమ, లాలిత్యం దూరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చిన్నారులకు దూరమైన బాల్యం యొక్క మాధుర్యాన్ని రుచి చూపించేలా జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రంథాలయాల్లో జూన్ 6వ తేదీ వరకు 40 రోజుల పాటు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. వివిథ తరగతులకు చెందిన 2,200 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వినోదంతో పాటు బాలల సాహిత్యం, కథలు వినడం, కథలు చెప్పడం, కథలు చదివించడం, పుస్తక సమీక్ష, చిత్రలేఖనం, రంగులు వేయడం, కాగితంతో కళారూపాలు తయారు చేయడం, సంగీతం, బొమ్మల తయారీ, నటన, యోగా, చదరంగం, క్యారమ్స్, క్విజ్, జీకే, స్పోకెన్ ఇంగ్లిష్, మొదలగు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. పలు పాఠశాలలకు చెందిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత,
విజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యం
మండలాల వారీగా ప్రారంభమైన
వేసవి విజ్ఞాన శిబిరాలు
ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు

గ్రంథాలయాలు... విజ్ఞాన వీచికలు