
పూర్వపు డీఈఓ ఆనందమూర్తి మృతి
అనంతపురం ఎడ్యుకేషన్: పూర్వపు జిల్లా విద్యాశాఖ విశ్రాంత అధికారి సెట్టేల ఆనందమూర్తి (74) కన్నుమూశారు. అనంతపురంలోని ఆరవిందనగర్‌లో ఆయన నివాసం ఉంటున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందారు. ఆనందమూర్తి సొంతూరు శెట్టూరు మండలం ములకలేడు గ్రామం. భార్య 2008లోనే మృతి చెందారు. ముగ్గురు కుమారులు సంతానం కాగా... ఇద్దరు హిందీ పండిట్లుగా, ఒకరు పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. 1980లో జేఎల్‌గా ఉద్యోగంలోకి చేరిన ఆనందమూర్తి పదోన్నతి పొంది 1996 నుంచి 2004 వరకు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా పని చేశారు. తర్వాత 2004 నుంచి 2006 వరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఐటీడీఏ, ఎస్సీఈఆర్టీలో పని చేసి 2008లో రిటైర్డ్ అయ్యారు. ఆయన మృతిపై ఎంఈఎఫ్ నాయకులు బండారు శంకర్, హనుమంతరావు, రమేష్, రామన్న తదితరులు సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
‘సింగిల్ ఆర్డర్ల’తో సంచలనం..
ఆనందమూర్తి డీఈఓగా పనిచేసిన కాలంలో జిల్లాలో టీచర్ల బదిలీలకు సంబంధించి ‘సింగిల్ ఆర్డర్ల’ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ప్రభుత్వం జారీ చేసిన బదిలీలతో పాటు ఆయా ఖాళీలకు డీఈఓ సింగిల్ ఆర్డర్ ఇచ్చి బదిలీలు చేశారు. ఒత్తిళ్ల కారణంగా డీఈఓ కొన్ని ఆర్డర్లు ఇస్తే వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసి అప్పట్లో కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమకు అనుకూలమైన వారికి చాలా ఆర్డర్లు ఇప్పించుకున్నారు. కొందరు డీఈఓ సంతకాలను ఫోర్జరీ చేసి ఆర్డర్లు ఇచ్చిన అంశం దుమారం రేగడంతో ఆయనను విశాఖ జిల్లా అరకు ఐటీడీఏకు బదిలీ చేశారు.
చికిత్సకు స్పందించక కియా ఉద్యోగి మృతి
ధర్మవరం అర్బన్: ఉద్యోగంలో పని ఒత్తిడి తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన కియా ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని పీఆర్టీ వీధికి చెందిన కావలి గౌరీప్రసాద్ (23) ఇంటర్ వరకు చదువుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా ఉన్నత చదువులు అభ్యసించలేక కియా పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. పరిశ్రమలో పని ఒత్తిడి తాళలేక చనిపోయావలని అనుకుంటున్నట్లు పలుమార్లు కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడ్డాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు నచ్చ చెప్పడంతో సర్దుకుపోతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గత మంగళవారం మధ్యాహ్నం తన అన్న ఫృథ్వీరాజ్‌కు ఫోన్ చేసి, తాను విషపూరిత ద్రావకం తాగినట్లు తెలిపాడు. దీంతో ఫృథ్వీరాజ్ ఇంటికి చేరుకుని అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్న గౌరీప్రసాద్‌ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రిలో మృతిచెందాడు. ఘటనపై సీఐ నాగేంద్రప్రసాద్ దర్యాప్తు చేపట్టారు.
కుక్కను తప్పించబోయి వ్యక్తి...
మడకశిర రూరల్: రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. వివరాలు.. మడకశిరకు చెందిన అమానుల్లా (54), బాబు బుధవారం ఉదయం వ్యక్తిగత పనిపై హిందూపురానికి వెళ్లారు. అక్కడ పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు... మడకశిర మండలం బుళ్లసముద్రం గ్రామ సమీపంలోని త్రిమూర్తి ఫామ్‌హౌస్ వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పిచబోయి ద్విచక్రవాహనం అదుపు తప్పిడంతో కిందపడ్డారు. తీవ్ర గాయాలైనా అమానుల్లా, బాబును స్థానికులు వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమానూల్లాను హిందూపురంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.