అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీపీఈడీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య బి.అనిత బుధవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 73.77 శాతం, మూడో సెమిస్టర్‌లో 82.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్‌లో చూడవచ్చు. అలాగే బీఎస్సీ, బీకాం, బీసీఏ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ దరఖాస్తుకు ఈ నెల 30 చివరి తేదీగా నిర్ధేశించినట్లు అనిత పేర్కొన్నారు. కార్యక్రమంలో రెక్టార్ జి.వెంకటనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ ఈ.రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొపెసర్ జీవీ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి.లోకేశ్వర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆటో ఢీకొని బాలుడి మృతి
కదిరి టౌన్: ఆటో ఢీకొన్న ఘటనలో సైకిల్‌పై వెళుతున్న ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కదిరిలోని కుమ్మర వీధికి చెందిన వేమారెడ్డి కుమారుడు దినేష్‌కుమార్‌రెడ్డి (11) బుధవారం ఉదయం ట్యూషన్‌కు వెళ్లి తిరిగి సైకిల్‌పై ఇంటికి బయలుదేరాడు. స్థానిక మౌనిక థియేటర్ సర్కిల్ వద్దకు చేరుకోగానే వెనుకనే వేగంగా వస్తున్న ఆటో ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన దినేష్‌కుమార్‌రెడ్డిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలోపు మృతి చెందాడు. బాలుడి తాత ఆదినారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు.
యువకుడి బలవన్మరణం
మడకశిర రూరల్: మండలంలోని హరేసముద్రం గ్రామానికి చెందిన లోకేష్‌నాయక్ (18) ఆలియాస్ పరమేష్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతిలోని ఓ పశువుల షెడ్డులో పనిచేస్తున్న లోకేష్ నాయక్... ఇటీవల ఇంటికి వచ్చి తిరిగి పనికి వెళ్లలేదు. జీతం బాగా ఇస్తున్న పనిని వదిలి ఎందుకు వచ్చావంటూ తల్లి మందలించింది. దీంతో క్షణికావేశానికి లోనైన లోకేష్‌నాయక్... బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బీపీఈడీ ఫలితాల విడుదల