
తల్లికి వందనం.. బాబు ద్రోహం
కదిరి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడికెళ్లినా పిల్లలను చూడగానే ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం ద్వారా నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు ఇస్తాం’ అని గొప్పలు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా పథకం అమలుకు నోచుకోలేదు. 2024–25 విద్యా సంవత్సరం కూడా ముగిసింది. కానీ నయాపైసా కూడా ఇవ్వలేదు. వచ్చే నెలలో 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇలాంటి తరుణంలో ‘ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా కాకుండా విడతల వారీగా ఇవ్వాలనుకుంటున్నాం’.. అని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఇది కూడా గతంలో రుణమాఫీ అంశంలో తమను మోసగించినట్లుగానే ఉందని విద్యార్థుల తల్లులు అంటున్నారు.
జగన్ హయాంలో రూ.కోట్లలో లబ్ధి..
జగన్ ప్రభుత్వంలో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,66,398 మంది విద్యార్థులకు రూ.946.41 కోట్ల లబ్ధి చేకూరింది. నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోనే అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. కదిరి నియోజకర్గంలో 27,869 మందికి రూ.156.22 కోట్లు, ధర్మవరంలో 28,656 మందికి రూ.164.60 కోట్లు, పుట్టపర్తిలో 23,483 మందికి రూ.133.32 కోట్లు, హిందూపురంలో 27,954 మందికి రూ.160.04 కోట్లు, మడకశిరలో 23,365 మందికి రూ.133.83 కోట్లు, పెనుకొండలో 25,987 మందికి రూ.147.23 కోట్లు, రాప్తాడు నియోజకవర్గంలో 9,084 మందికి రూ.51.25 కోట్లు చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ది చేకూరింది. అంతేకాక జిల్లాలో ‘జగనన్న విద్యాకానుక’ ద్వారా 1,62,699 మందికి రూ.62.21 కోట్లు, ‘జగనన్న వసతి దీవెన’ కింద 43,301 మందికి రూ. 162.38 కోట్లు, ‘జగనన్న విద్యా దీవెన’ కింద 44.082 మందికి రూ.314.91 కోట్ల లబ్ది చేకూరింది.
నిధుల కేటాయింపులోనే కలవరం..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి ‘తల్లికి వందనం’ అని పేరు మార్చడం తప్ప చేకూర్చిన లబ్ధి అంటూ ఏదీ లేదు. 2025–26కు సంబందించి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ‘తల్లికి వందనం’ పథకానికి కేవలం రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిని చూడగానే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరిచారు. గత జగన్ ప్రభుత్వం ఇంట్లో ఒకరికి అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు చొప్పున లబ్ధి చేకూరిస్తే ఏడాదికి జిల్లాలోని విద్యార్థులకు రూ.250 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈ లెక్కన తల్లికి వందనం కింద ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ పథకం లబ్ధి చేకూర్చాలంటే చంద్రబాబు సర్కార్ కేటాయించిన నిధులు ఏ మూలకూ సరిపోవని తేల్చేశారు. అలా కాకుండా ఇంట్లో ఒక్కరికే పథకం లబ్ధి చేకూర్చినా ఈ నిధులు సరిపోవని అంటున్నారు.
పథకం అమలుపై
కమ్ముకున్న నీలి నీడలు
విడతల వారీగా ఇస్తామంటున్న సీఎం చంద్రబాబు
బాబు మాటలు
నమ్మబోమంటున్న తల్లులు
పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించే అమ్మ ఒడి పథకాన్ని కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీ సాక్షిగానూ ప్రకటించారు. అయితే పథకం అమలులో అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తూ.. తాజాగా విడతల వారీగా ఇస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనపై విద్యార్థుల తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతలు విధిస్తే ఒప్పుకోం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండానే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేయాల్సిందే. నిబంధనల పేరుతో కోతలు విధించాలని చూస్తే ఊరుకోం.
– రాజేంద్రప్రసాద్ యాదవ్,
వైఎస్సార్ విద్యార్థి విభాగం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బకాయి కలిపి చెల్లించాలి
‘తల్లికి వందనం’ పథకం కింద గత విద్యాసంవత్సరానికి చెల్లించాల్సిన బకాయితో కలిపి ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే లోపు మొత్తం నగదు మంజూరు చేయాలి. అది కూడా విడతల వారీగా కాకుండా అంతా ఒకేసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలి. షరతులు వర్తిస్తాయని సాకులు చెబితే ఒప్పుకోం.
– బాబ్జాన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

తల్లికి వందనం.. బాబు ద్రోహం

తల్లికి వందనం.. బాబు ద్రోహం

తల్లికి వందనం.. బాబు ద్రోహం