
ప్రతి సమస్యకూ సంతృప్తికర పరిష్కారం చూపండి
ప్రశాంతి నిలయం: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసే వినతులకు సంతృప్తికర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై 172 వినతులు అందాయి. కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులకు వర్చువల్ విధానంలో రాష్ట్ర స్థాయి కేపీఐల శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 14న నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పాల్గొనాల్సి ఉంటుందన్నారు. అలాగే మండల స్థాయి అధికారులందరూ వారివారి మండల స్థాయిలో జరిగే శిక్షణకు హాజరు కావాలన్నారు. అన్ని శాఖల ప్రధాన హెచ్‌ఓడీలు నెలవారీ కార్యాచరణ ప్రణాళిక నివేదికలు, నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జూన్ 5న జిల్లా అంతటా అన్ని ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఇందుకు ఎన్ని మొక్కలు అవసరమవుతాయో ముందస్తుగానే నివేదికలు సిద్ధం చేసి డీఎఫ్‌ఓకు మంగళవారం లోపు అందజేయాలన్నారు. జిల్లాలో అతిసారం ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్‌కుమార్, డీఆర్వో విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పశుసంవర్దక శాఖ జేడీ శుభదాస్, సెరికల్చర్ జేడీ పద్మావతి, ఏపీఎంఐసీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్‌కుమార్, ఎల్‌డీఎం రమణకుమార్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం, డీఈఓ కృష్ణప్ప, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీసహానీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్