
వైఎస్సార్ కృషితోనే హంద్రీ–నీవా పూర్తి
ఉరవకొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితోనే హంద్రీ–నీవా మొదటి దశ పనులు 90 శాతం పూర్తి చేసి జీడిపల్లి వరకు నీటిని తీసుకురాగలిగారని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి తెలిపారు. శనివారం వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని స్వగృహంలో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. ఛాయాపురం వద్ద సీఎం చంద్రబాబు ప్రజావేదిక సాక్షిగా హంద్రీ–నీవాకు సంబంధించి అసత్యాలు చెప్పారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ–నీవా పనులు చేపట్టారన్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హంద్రీ–నీవా కాలువ నీటి సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయించారన్నారు. దీనికి సంబందించి టెండర్లు కుడా పూర్తి చేశారని, పనులు ప్రారంభించే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. హంద్రీ–నీవాకు 60 నుంచి 70 టీఎంసీలు రావాలంటే కాలువను క్రమం తప్పకుండా వెడల్పు చేయాల్సి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో వెడల్పు చేస్తాం, రెండో దశ పనుల్లో కాలువకు లైనింగ్ చేస్తామంటే ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాయలసీమకు సమృద్ధిగా కృష్ణాజలాలు అందాలంటే మొదటి ఫేజ్‌లో 10వేల క్యూసెక్కులతో కాలువను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. రెండో విడతలో లైనింగ్ పనులు చేపట్టే బదులు ఆ నిధులతో కాలువ వెడల్పు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాపై అపారమైన ప్రేమే ఉంటే కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఎయిమ్స్‌ను మంగళగిరికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. దీంతో పాటు కర్నూలుకు మంజూరైన లా యూనివర్సిటీని ఇతర ప్రాంతానికి తరలించి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. సాంకేతికతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చే మీరు మరీ అమరావతి రాజధాని కోసం వేలాది కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ఛాయాపురంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గ్రామంలో భూములు కౌలుకు ఇస్తే ఎకరాకు రూ.60 వేలు ఇస్తారని చెబుతున్నారని, ఆ గ్రామస్థులతో మాట్లాడి అక్కడి భూములన్నీ కౌలుకు ఇప్పిస్తా ఎకరాకు రూ.60వేలు కచ్చితంగా ఇప్పిస్తారా అంటూ సవాల్ విసిరారు. సూపర్‌సిక్స్ హామీలు నెరవేర్చే దమ్ములేక అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్‌తో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం
సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దమ్ము లేదు
ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ధ్వజం