
వెరిటాస్ సైనిక్ స్కూల్‌కు ప్రభుత్వ అనుమతి
తిరుపతి కల్చరల్: తిరుపతిలో 22 ఏళ్లుగా బీఎస్‌ఆర్ విద్యాసంస్థల ద్వారా ఇటు విద్యార్థుల ఉన్నతికి, అటు దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అందరి సహకారంతో భారత రక్షణ దళానికి ఎంతో మంది సైనికులను అందించేలా కృషి చేశామన్నారు. వెరిటాస్ సైనిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారిచే అత్యుత్తమ విద్యను అందస్తూ వస్తున్నామన్నారు. రాబోవు కాలంలో ప్రభుత్వ సైనిక్ స్కూలు అనుసంధానంతో కరికులం, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ వంటివన్నీ సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. వెరిటాస్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థీ దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇకపై ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తామన్నారు. విద్యా సంస్థలో ప్లస్–1 (ఇంటర్మీడియెట్)తో స్పెషల్ ఎన్‌డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వైరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బి.శ్రీకర్‌రెడ్డి, బి.సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.
దేశ రక్షణకు విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యం
వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి