
వ్యవసాయాన్ని లాభసాటి చేయండి
బుక్కరాయసముద్రం: నూతన ఆవిష్కరణలతో వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ సూచించారు. బీకేఎస్ మండలం రేకులకుంటలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో అత్యల్ప వర్షపాత మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు హాజరయ్యారు. డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు కొత్త పంటల సాగుపై రైతులను చైతన్య పరచాలన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల పాత్ర కీలకమన్నారు. నీటి సంరక్షణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. జింకలు, అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకునే అంశాలపై చైతన్య పరచాలన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ జాన్సన్, ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ విస్తరణ సంచాలకుడు డాక్టర్ శివనారాయణ, రేకులకుంట పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శంకర్‌బాబు, పశుసంవర్థక శాఖ ఏడీ డాక్టర్ రత్నకుమార్, నాబార్డ్ జిల్లా అధికారి అనూరాధ, ఉద్యాన పరిశోధనా అధిపతి డాక్టర్ సుబ్రహ్మణ్యం, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ సహాయ సంచాలకుడు డాక్టర్ సత్యనారాయణ