పకడ్బందీగా కౌంటింగ్‌ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా కౌంటింగ్‌ ప్రక్రియ

May 31 2024 12:48 AM | Updated on May 31 2024 12:48 AM

పకడ్బందీగా కౌంటింగ్‌ ప్రక్రియ

పకడ్బందీగా కౌంటింగ్‌ ప్రక్రియ

హిందూపురం/లేపాక్షి: ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కౌంటింగ్‌ కేంద్రాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు తెలిపారు. గురువారం హిందూపురం, లేపాక్షిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, బిట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ముందస్తుగానే అన్ని చర్యలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.

పటిష్టంగా పోలీసు బందోబస్తు

నియోజకవర్గాల కౌంటింగ్‌ హాల్‌ ను కలెక్టర్‌ పరిశీలించి బిట్‌ కళాశాల, లేపాక్షి గురుకుల పాఠశాల ప్రధాన ద్వారం వద్ద నిరంతరం బందోబస్తును పటిష్టంగా ఉంచాలన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలకు తావివ్వకూడదన్నారు. ఈవీఎంల కౌంటింగ్‌ కోసం ప్రతి టేబుల్‌ వద్ద ఒక కౌంటింగ్‌ గెజిటెడ్‌ను సూపర్‌వైజర్‌గా , ఒక కౌంటింగ్‌ అసిస్టెంట్‌, కౌంటింగ్‌ స్టాఫ్‌ ఒకరు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారని కలెక్టర్‌ తెలియజేశారు. అలాగే ప్రతి టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఒక సహాయ రిటర్నింగ్‌ అధికారి, గెజిటెడ్‌ను కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అధికారులు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారని చెప్పారు. ఈటీపీబీఎస్‌కు సంబంధించి ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ఒక అసిస్టెంట్‌, ఒక ఏఆర్‌ఓ ఉంటారన్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు కేంద్రానికి, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు కేంద్రాలకు వెళ్లేందుకు సిబ్బందికి, ఏజెంట్లకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కేంద్రంలో వరుసగా ఏడు చొప్పున మొత్తం 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ఆయా బ్లాక్‌లలో ఆ నియోజకవర్గాల లెక్కింపు జరుగుతున్న తీరు అందరికీ అర్ధం అయ్యేలా స్పష్టంగా తెలియజేసే సైన్‌బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హిందూపురం ఆర్‌ఓ జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌, పెనుగొండ ఆర్‌ఓ సబ్‌కలెక్టర్‌ అపూర్వ భరత్‌, కదిరి ఆర్‌ఓ వంశీకృష్ణ, మడకశిర ఆర్‌ఓ గౌరీశంకర్‌, పుట్టపర్తి ఆర్‌ఓ భాగ్యరేఖ, ధర్మవరం ఆర్‌ఓ వెంకటశివసాయిరెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాల సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ప్రతి అసెంబ్లీ కౌంటింగ్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

జిల్లా కలెక్టర్‌ పి అరుణ్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement